తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన సీనియర్ కథానాయికలలో 'ఆమని' ఒకరు. ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఈ సినిమా అత్యంత విజయవంతమైంది. అలాగే బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఇక ఆ త‌ర్వాత 1994లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాలో ఆమ‌ని త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను క‌ట్టిప‌డేసింది. 

 

ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "నా అసలు పేరు 'మంజుల' .. మా ఇంట్లో వాళ్లంతా 'మంజూ' అని పిలుస్తుంటారు. తెలుగులో నేను మొదటిసారిగా 'జంబలకిడిపంబ' చేశాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా ఈవీవీ సత్యనారాయణగారు నన్ను పరిచయం చేశారు. ఆయనే నా పేరును 'ఆమని'గా మార్చారు. 

 

అప్పటికి నాకు ఆ పేరుకు అర్థం తెలియదు. ఆ తరువాత కొంత కాలానికి ఈవీవీగారి దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో చేశాను. ఆ సమయంలో నాగార్జునగారు మాట్లాడుతూ, నా పేరు బాగుంది అన్నారు. 'ఆమని' అంటే 'వసంతం' అని ఆయనే చెప్పారు. అప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో, లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చినమారయ్య, గురవయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సృష్టిలో అమ్మగొప్పతనం, కుటుంబంలో అమ్మ విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: