శత్రు మూకల దాడిలో ప్రాణాలు వదిలిన జార్జి రెడ్డి కథపై చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ జార్జి రెడ్డి చిత్రంపై అనేక వివాదాలు చుట్టు ముడుతున్నాయి. జార్జి రెడ్డి ఓ రౌడీ అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అతనితో ప్రత్యక్ష పరిచయం ఉండి , కలిసి చదువుకున్న వ్యక్తిగా తమ్మారెడ్డి భరద్వాజ్ అనేక విషయాలను వెల్లడించారు.

 

                ఆయన హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నమ్మిన సిద్దాంతాల కోసం చివరి వరకు నిలబడ్డాడు. వాటి కోసమే ప్రాణాలు కూడా వదిలాడు. అందుకే ఆయన హీరో అని తెలిపాడు. ఆయన నమ్మే సిద్దాంతాలను వ్యతిరేకించే వారికి ఆయన రౌడీ, విలన్‌గా కనిపించి ఉండొచ్చని అన్నాడు. అలాంటప్పుడు ఆయనకు కూడా అవతల వారు విలన్లుగా కనిపించి ఉండొచ్చని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు. ఒక్కడే వెళ్లి.. పది ఇరవై మందిని ఎదిరించేవాడు.. గొప్ప బాక్సర్ అని తెలిపాడు. 

 

                 కాలేజ్ నుంచి రెస్టిగేట్ అయిన సమయంలో మా ఇంట్లోనే ఉండేవాడు.. మా ఇంట్లో ఉండే కమ్యూనిస్ట్ భావాజాలానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివేశాడని పేర్కొన్నాడు, లెనిన్, మార్క్స్, దాస్ కాపిటల్ లాంటి పుస్తకాలన్నీ తిరగేశాడని తెలిపాడు. తాను కూడా అవన్నీ చదవలేదు కానీ అతను చదివేశాడని, అప్పటి నుంచి తన సిద్దాంతం మారిందని, సరైన గమ్యంతో ముందుకు సాగాడని తెలిపాడు. యూనివర్సిటీలో మతాలను లాగొద్దని అందరితో వాదించేవాడు. వాటికి వ్యతిరేకంగానే అతను పోరాటం చేశాడని తెలిపాడు. మతాలను వ్యాప్తి చేసే వారికి జార్జిరెడ్డి అందుకే విలన్‌గా కనిపించి ఉంటాడని పేర్కొన్నాడు. కాలేజ్‌లో విద్యార్థులకు అండగా నిలబడే వాడు, తనను నమ్మిన వారి కోసం ఏదైనా చేసేవాడని తెలిపాడు. అందరినీ  మర్యాదగా పలకరించేవాడు, ఎంతో గౌరవించే వాడు.

           

                హాస్టల్‌లో విద్యార్థులు తప్పా మిగతా వారెవరూ ఉండకూడదని పోరాడేవాడు. ధూల్ పేట నుంచి వచ్చిన కొంత మంది రౌడీలు హాస్టల్‌లో ఎందుకు ఉన్నారు.. వారికి పోలీసులు ఎందుకు రక్షణ కల్పించారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. చివరి రోజు జరిగింది అదే.. ఆ రోజు జార్జి రెడ్డిని  తానే 1 30గంటలకు లైబ్రరీ వద్ద వదిలి వెళ్లానని, ఆ తరువాత గంటకే హత్య చేశారని చెప్పుకొచ్చాడు. హాస్టల్‌కు ఒంటరిగా వెళ్లొద్దని నాకు చెప్పిన వ్యక్తి, అతనెలా వెళ్తాడని కావాలనే ఎవరో బలవంతంగా తీసుకెళ్లి ఉంటారని చెప్పుకొచ్చాడు.భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన వాడు.. ఇలాంటి వాటిలోకి వస్తారని ఎవ్వరూ ఊహించరు.. ఒకవేళ అతను బతికి ఉన్నా తనకున్న భావాజాలానికి అడవులకు వెళ్లేవాడేమోనని చెప్పుకొచ్చాడు. తోటీ విద్యార్థులకు కూడా క్లాస్‌లు చెప్పేవాడని, ఎన్నో యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ వచ్చినా.. ఉస్మానియాలోనే చేరాడని తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: