టైటానిక్ సినిమా ద్వారా మన అందరికీ పరిచయమైన లియోనార్డో డికాప్రియో కేవలం హాలీవుడ్ హీరో మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికుడు కూడా. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుందనే విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కాలుష్యం క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో సుమారు 1500 మంది ఇండియా గేట్ వద్ద... ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా వాయు కాలుష్యం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇది తెలుసుకున్న టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేసారు.  

 

‘ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ 1500 మంది సామాజిక ఉద్యమకారులు ఇండియా గేట్ వద్ద ప్రదర్శన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వాయుకాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15లక్షల మంది చనిపోతున్నారు. వాయుకాలుష్యం అనేది భారత్‌లో ఐదో అతిపెద్ద హంతకురాలు.’ అని లియోనార్డో పేర్కొన్నారు. 

 

భారతదేశంలో పర్యావరణ సమస్యల గురించి మాట్లాడటం లియోనార్డో డికాప్రియోకి ఇదేం మొదటిసారి కాదు. గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు లియోనార్డో డికాప్రియో తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. చెన్నైలో నీటి కొరత వచ్చినప్పుడు కూడా ఆయన బాధను సామజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. లియోనార్డోకి భారత దేశం అంటే చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో కేరళని ఇలా వర్ణించాడు.. .‘భూమి మీద స్వర్గం ఏదైనా ఉంటే అది ఇదే.’ లియోనార్డో పర్యావరణ సమస్యల గురించి అవగాహనా కల్పించడానికి 1998 లో 'లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్' ని స్థాపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: