ఈమధ్య కుటుంబ కథలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కుటుంబంలోని అనుబంధాలు, తమాషా సన్నివేశాలు, పల్లెటూరి అందాలు, భావోద్వేగాలు.. ఇలా కలబోసి సినిమాని ఇంటిల్లపాదీ చూసేలా నిర్మిస్తున్నారు. అయితే.. ఇది మోనాటనీ అవుతుందేమోనన్న అనుమానాలూ వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా సాయి ధరమ్ తేజ్ 'ప్రతి రోజూ పండుగే' కనిపిస్తోంది.

 

 

ఇటువంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా దిల్ రాజు బ్యానర్ సినిమాలు నిలుస్తాయి. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన శతమానం భవతి, శ్రీనివాస కల్యాణం, సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో ఉన్నట్టు అనిపిస్తాయి. రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే కూడా ఇదే తరహాలో కనిపిస్తుంది. ఈ మూడు సినిమాలను చూస్తే.. పల్లెటూరు, కుటుంబాలు, పెద్ద ఇల్లు, ఇంటి నిండా జనం, ఇంటి పెద్ద, బావా మరదలి సరదాలు, ప్రేమ, ఎమోషన్స్.. ఇలా ప్రతీదీ ఒకేలా అనిపిస్తాయి. నటీనటులు మారతారు.. కథ మారుతుందేమో కానీ.. మెయిన్ ప్లాట్ అంతా ఒకటే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రతిరోజు పండుగ కూడా అలానే అనిపిస్తోంది. తాత - మనవడు, పల్లెటూరు, ఇంటి పెద్ద, పెద్ద ఇల్లు, తేజ్ - రాశి ఖన్నా కెమిస్ట్రీ.. ఇలా అన్నీ గత సినిమాలను పోలి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆ జోనర్ సినిమా అనే అర్థమవుతోంది. 

 

 

గీతా ఆర్ట్స్, యూవీ బ్యానర్ పై మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పైన చెప్పిన సినిమాలన్నింటిలో కుటుంబ పెద్ద పాత్ర ప్రకాశ్ రాజ్ పోషించాడు. రొటీన్ అవుతుందనేమో.. ఈసారి ఆ పాత్రకు తమిళ నటుడు సత్యరాజ్ ను తీసుకున్నారు. పై సినిమాలకు, ఈ సినిమాకు ఈ మార్పు మాత్రం భారీగా కనపడుతోంది. మరి మిగిలిన సినిమాలతో ఈ సినిమా ఏమాత్రం విభిన్నంగా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 20 వరకూ ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: