ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి నాగబాబు నిష్క్రమణ ఖరారైంది. శుక్రవారం ఎపిసోడ్ ఆఖరు అని ఆయనే చెప్పారు. ఈ విషయంపై కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన తన నోటితోనే చెప్పేశారు. అయితే ఆయన చెప్పిన విధానం చూస్తే.. ఆయన్ను జబర్దస్‌ నుంచి బయటకు పంపేసినట్టు అర్థమవుతోంది. ఇందుకు ఆయన మాటలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

 

ఇలాంటి షోలో తనకు తానుగా మానేసే పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు నాగబాబు. అంటే ఆయన తనకు తానుగా వెళ్లిపోలేదన్నమాట. ఈ ఒక్కమాట అసలు విషయాన్ని బయటపెడుతోంది. అయితే.. తనకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులని నాగబాబు చెప్పారు. 2013 ఫిబ్రవరి నుంచి 2019 నవంబర్ వరకు తన ప్రయాణం ‘జబర్దస్త్’లో కొనసాగిందని.. తనకు ఇదొక హ్యాపీ, ఎమోషనల్ జర్నీ అని నాగబాబు అన్నారు.

 

ఏదైనా ప్రోగ్రామ్ కానీ, ప్రయాణం కానీ ఎక్కడో ఒక చోట ఆగాలని.. అయితే, ప్రోగ్రామ్ ముగియముందే తన ప్రయాణం ముగించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కానీ, ఎవరి మీద నేరాలు వేయడం కానీ చేయనని స్పష్టం చేశారు. ‘జబర్దస్త్’ షోలోకి ప్రవేశించే సమయానికి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని నాగబాబు చెప్పారు. అలాంటి పరిస్థితిలో ‘జబర్దస్త్’ తనకెంతో హెల్ప్ అయ్యిందని వెల్లడించారు. ఈ విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు.

 

అంతకు ముందు ‘అదుర్స్’ షోలో జడ్జిగా చేసిన తనను ‘జబర్దస్త్’లో కూడా చేయాలని శ్యామ్ కోరారని, తాను కూడా సంతోషంగా ఒప్పుకున్నానని నాగబాబు చెప్పారు. ఒకే షోలో ఏడున్నర సంవత్సరాలు కొనసాగడమంటే మామూలు విషయం కాదని, ఒక రికార్డు అని నాగబాబు అన్నారు. ఈ విషయంలో ఈటీవీ యాజమాన్యానికి తాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: