ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మగా కీర్తి గడించిన మణిశర్మ తనదైన బాణీలతో ఓ దశలో టాలీవుడ్ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. 1998లో బావగారూ బాగున్నారాతో టాలీవుడ్ ని ఆకర్షిస్తే, వెంటనే చిరంజీవితోనే చేసిన చూడాలని ఉంది సినిమా ఆయన్ను స్టార్ మ్యూజిక్ డైరక్టర్ గా మార్చేసింది. 2003లో మహేశ్ ఒక్కడు వచ్చే వరకూ మణిని చూడాలని ఉంది మ్యూజిక్ డైరక్టర్ అనేవారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

 

 

మణిశర్మ దాదాపు 14 ఏళ్ల పాటు టాలీవుడ్ ని ఏలేశాడని చెప్పాలి. 2012 నుంచి దేవీశ్రీ ప్రసాద్ స్పీడ్ పెరగడంతో ఆయనకు బ్రేకులు పడ్డాయి. పెద్ద హీరోలెవరూ మణి వైపు చూడలేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి మణి స్థాయికి తగ్గవి కాదు. 2019లో మణిశర్మ హవా మళ్లీ మొదలైనట్టే ఉంది. పూరి దర్శకత్వంలో ఇటివల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు మణి అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ సినిమా సూపర్ హిట్ అవటానికి సగం కారణమయ్యాయి. ఇప్పుడు ఇదే ఊపులో మణికి ఓ మెగా చాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడని టాక్.  ఎన్నో వీనులవిందైన పాటలు, మాస్ బీట్స్, బ్లాక్ బస్టర్స్.. చిరంజీవి – మణిశర్మ కాంబోలో ఉన్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా మణి బీట్స్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

 

 

మణిశర్మకి చిరంజీవి సినిమానే కాకుండా వెంకటేశ్ చేస్తున్న అసురన్ రీమేక్, రామ్ హీరోగా వస్తున్న రెడ్ సినిమాల అవకాశాలు కూడా వచ్చాయట. ఇదే నిజమైతే మణి ఈజ్ బ్యాక్ అన్నట్టే.. పరిస్థితి. ఈ వార్త నిజమై మణిశర్మ తన స్థాయి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇప్పట్లో ఆయన్ను అందుకోవడం ఎవరి తరం కాదు. మణి మనసు పెట్టి చేస్తే ఇదేమంత అసాధ్యం కాకపోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: