మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా జబర్ధస్త్ రియాలిటీ షో కి ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నారో ఆ షోకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నాగబాబు ఈ షో ను ఏడున్నర సంవత్సరాల పాటు సక్సస్ ఫుల్ గా నడిపారు. జబర్ధస్త్ వెనక నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తపన ఎంతగా ఉందో సక్సెస్ కోసం టీమ్ వర్క్ చేయించడంలో నాగబాబు అంతే శ్రమించారని ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇక రోజాతో కలిసి జడ్జిగా బాబు గారు ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే నాగబాబు ఈ షో నుంచి తప్పుకుంటున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇంతకుముందు జనసేనలో చేరి తమ్ముడు పవన్ కల్యాణ్ కి అండదండలుగా ఉంటూ ఇక జబర్ధస్త్ షో చేయరని ప్రచారమైంది.

అయితే నాగబాబు తిరిగి షోలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆయనే జడ్జిగా కొనసాగారు. ఎట్టకేలకు ఈ శుక్రవారం ఎపిసోడ్ నుంచి ఆయన కనిపించరని తాజా సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా వెల్లడించారు. ఏడున్నరేళ్ల పాటు ఈ షోలో నిర్విరామంగా కనిపించే అవకాశం కల్పించిన శ్యాంప్రసాద్ రెడ్డి బృందానికి ఆయన ధన్యవాదాలు చెబుతూ తాను ఎగ్జిట్ అవుతున్నానని తెలిపారు. ఫిబ్రవరి 2013 నుంచి ఆగస్ట్ 2019 వరకూ ఈ షోలో కొనసాగానని నాగబాబు వెల్లడించారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే తాను విడిచి వెళుతున్నానని అన్నారు.

అయితే తాను ఈ షో నుంచి తప్పుకోవడానికి రెమ్యూనరేషన్ అసలు కారణమని బయట ప్రచారమవుతోంది. దీనిపైనా నాగబాబు క్లారిటీనిచ్చారు. నేను ఈ షోలో చేరడానికి రెమ్యూనరేషన్ ఏమాత్రం కారణం కాదు. అలాగే వదిలి వెళ్లడానికి కూడా రెమ్యూనరేషన్ కారణం కాదు. వంద శాతం రెమ్యూనరేషన్ కారణం కాదు అన్నారు. పరిస్థితులే బయటకు వెళ్లేలా చేశాయి. మధ్యలో ఇలా వెళతానని నేను కూడా అనుకోలేదు. కానీ వెళ్ళక తప్పడంలేదు! అని అన్నారు. జబర్ధస్త్ షోలో చేరక ముందు తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ఈ షో ఆదుకుందని అన్నారు. తనకు కామెడీపై ఉన్న ఆసక్తి చూసి శ్యాంప్రసాద్ రెడ్డి అవకాశం ఇచ్చారని నాగబాబు వెల్లడించారు. జబర్ధస్త్ షో గురించి తాను ఏనాడూ వ్యతిరేకంగా ఎక్కడా చెప్పలేదని .. అలాగే వివాదాల్ని కోరుకోలేదని తెలిపారు. అయితే వాస్తవంగా ఈ షోకి ముందున్న డైరెక్టర్స్ ఇప్పుడు లేకపోవడంతోనే ఇలా సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: