టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు ఈ యంగ్‌ హీరో. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా నిలబడిన విజయ్ దేవరకొండకు టాలీవుడ్లో అభిమానులు అనేక పేర్లతో పిలుచుకుంటుంటారు.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత  విజయ్ ను ముద్దుగా అర్జున్ రెడ్డిగా పిలుస్తున్నారు.  ఇపుడు రౌడీ అని పిలుస్తున్నారు.  విజయ్ మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లోనూ తన దూకుడు చూపిస్తూనే వస్తున్నాడు.

 

సాధారణంగా నటీనటులు కెరియర్ పరంగా కొంత దూరం ప్రయాణించాక వ్యాపార వ్యవహారాలను గురించిన ఆలోచన చేస్తారు. కానీ అందుకు భిన్నంగా చాలా వేగంగా ఆయన 'రౌడీ బ్రాండ్' పేరుతో దుస్తుల అమ్మకాలను ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇక ఎక్కువ టైమ్ తీసుకోకుండానే సొంత బ్యానర్ ను స్టార్ట్ చేసి సినిమాల నిర్మాణంలోను అడుగుపెట్టేశాడు. ఇక ఇటీవ‌ల హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా తీయడం తెలిసిందే. ఆ సినిమాకు ప్రేక్షకాదరణ కూడా రావడంతో విజయ్ మరిన్ని సినిమాలపై దృష్టి పెట్టారు. తన సినిమాలకు కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు.

 

అయితే విజయ్ దేవరకొండ సొంత ఇంటి విషయంలోను అదే స్పీడ్ చూపించాడు. ఫిల్మ్ నగర్లో హీరో శ్రీకాంత్ ఇంటికి సమీపంలోని ఒక కొత్త ఇంటిని భారీ మొత్తం చెల్లించి విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నాడు. భారీ మొత్తం వెచ్చించి ఈ ఇంటిని కొన్నారని, సువిశాలంగా, ఆహ్లాదకరంగా దాన్ని తీర్చిదిద్దారని అంటున్నారు. అదే విధంగా నిన్న (ఆదివారం) కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గృహప్రవేశం చేశారు. మొత్తానికి పెళ్లి కాకుండానే ఓ ఇంటి వాడ‌య్యాడు విజ‌య్‌. ప్ర‌స్తుతం ఆయన తాజా చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' త్వరలో ప్రేక్షకులముందుకు రానున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: