సునీల్... ఒకప్పుడు ప్రతీ సినిమాలో కనిపించి తనదైన పంచులతో ప్రేక్షకులనీ నవ్వించేవాడు. ఒకానొక సమయంలో సునీల్ లేకుండా సినిమాలే రాలేదంటే అతిశయోక్తి కాదేమో! చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కామెడీ అంటే సునీల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కామెడీ నుండి పక్కకి వెళ్ళీ హీరోగా సినిమాలు చేసినప్పటి నుండి సునీల్ కి కలిసి రావట్లేదు. మొదటి రెండు మూడు సినిమాలు బాగానే వర్కవుట్ అయినప్పటికీ, మాస్ హీరోగా అవుదామనుకున్న సునీల్ ప్రయత్నం విఫలమయింది.

 

ఆ తర్వాత సునీల్ ఎక్కువ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం మళ్లీ తన పాత పద్దతిలోనే కామెడీ చేసేందుకు ముందుకు వస్తున్నాడు. ఈ మేరకు తన స్నేహితుడైన త్రివిక్రమ్ సినిమా అరవింద సమేతలో నీలాంబరి పాత్రలో కనిపించాడు. కానీ ఆ సినిమా సునీల్ కి పేరు తీసుకురాలేకపోయింది. దాంతో అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే మళ్ళీ త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కనిపించబోతున్నాడు.

 

ఈ సారి మంచి కామెడీతో వస్తున్నాడని సమాచారం. త్రివిక్రమ్ సినిమా అంటే కామెడీ ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో పనిమనుషులు కూడా పంచులు వేస్తుంటారు. ప్రతీ క్యారెక్టర్ కి పంచులు రాసుకునే త్రివిక్రమ్ ఈ సారి సునీల్ కి మంచి క్యారెక్టర్ రాసుకున్నాడని సమాచారం.  సునీల్ మళ్లీ కమెడియన్ గా నిలబడాలంటే మంచి కామెడీ రోల్ పడాలి. అలాంటి రోల్ ఈ సినిమాలో ఉండనుందట.

 

మరి ఈ సినిమాతోనైనా సునీల్ కమెడియన్ గా నిలదొక్కుకుంటాడా లేదా చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హారికా హాసినీ బ్యానర్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటి టబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: