శుక్రవారం వస్తోందంటే సినిమా హాల్ల దగ్గర 'సందడే సందడి'. థియేటర్లలో కొత్త సినిమాల హంగామా మామూలుగా లేదు. ఆ రోజు ఎంతో మంది జాతకాలు తారుమారు అవుతుంటాయి. హిట్టొస్తే ఒకలా.. ఫ్లాపైతే ఇంకోలా జాతకం మారుతుంటుంది. పోయిన శుక్రవారం రిలీజైన సినిమాలు అనుకున్న సక్సస్ ను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డాయి. కొందరు కొత్తగా ట్రై చేసినప్పటికి పాపం అసలు లక్ కలిసిరాలేదు. సక్సెస్ యథావిధిగా 5-10శాతం లోపే ఉంది. ఇంతకీ ఈ ఫ్రైడే ఎవరు హిట్ కొట్టబోతున్నారు.. ఈ వారం నెగ్గేది ఎవరు..! అన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వచ్చే శుక్రవారం( 29 ) న అరడజను సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

 

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న `కమ్మరాజ్యంలో` కడపరెడ్లు` పిచ్చ ప్రమోషన్స్ తో రిలీజవుతోంది. హత్యా రాజకీయాలు.. కుల రాజకీయాలే మేయిన్ బ్యాగ్డ్రాప్ గా ఆర్జీవీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇదే రోజున ఆర్జీవీకి పోటీగా కుర్ర హీరో నిఖిల్ వార్ లోకి రావడం ఆసక్తికరం. మనోడు నటించిన 'అర్జున్ సురవరం' కొన్ని అవాంతరాల్ని దాటుకుని ఎట్టకేలకు రిలీజవుతోంది. నిఖిల్ ని గత కొన్ని నెలలుగా ఊరిస్తూ అష్టకష్టాలు పెడుతున్న `అర్జున్ సురవరం` ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. ట్రైలర్ కాస్త ఆకట్టుకోవడంతో ఈ సినిమా కమ్మరాజ్యంలో.. సినిమాకి కాస్త పోటీనిస్తుందన్న టాక్ ఉంది.

 

ఇక గత కొన్నేళ్లుగా రిలీజ్ కి నోచుకోక ల్యాబుకే అంకితమైన `రఘుపతి వెంకయ్య` సినిమా ఈ వారంలో రిలీజ్ అవుతోంది. సినిమాకి ఆద్యుడైన రఘుపతి వెంకయ్య జీవితకథతో తీసిన సినిమాగా ఇది. సీనియర్ నరేష్ టైటిల్ పాత్ర పోషించారు. అలాగే అంతా కొత్త వాళ్లతో నిర్మించిన `రాజావారు రాణివారు` రిలీజ్ కాబోతోంది. గత కొంత కాలంగా గౌతమ్ మీనన్ అలాడిపోతున్న `తూటా` కూడా తమిళ- తెలుగు భాషల్లో ఇదే రోజున రిలీజ్ కు సిద్ధమవుతోంది. వీటిల్లో ఏ సినిమా ఈ శుక్రవారం హిట్ టాక్ తెచ్చుకుంటుంది? ఏ సినిమా ఫ్లాప్ లిస్ట్ లో చేరబోతోంది..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నిఖిల్ ని `అర్జున్ సురవరం` గండం నుంచి గట్టెక్కిస్తుందా? లేకపోతే వర్మ కుల వర్గ కుమ్ములాట నేపథ్యంలో రూపొందిస్తున్న `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` అనుకున్న స్థాయిలో ఆకట్టుకుంటుందా? అన్నది  ఈ నెల 29 న తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: