పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ లో నటించ బోతున్నాడు అంటూ దిల్ రాజ్ అధికారికంగా ప్రకటించిన తరువాత అతడు ఈమధ్య పవన్ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో ‘పింక్’ రీమేక్ గురించి దిల్ రాజ్ తన ఆలోచనలు పవన్ కు షేర్ చేస్తూ ఈ రీమేక్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ చేత వ్రాయించడం పెద్దగా ఇష్టం లేదు అన్న సంకేతాలు ఇచ్చినట్లు టాక్. 

దీనికి కారణం త్రివిక్రమ్ ఒకసారి స్క్రిప్ట్ వ్రాసిన తరువాత ఎంతో బలవంతపెడితే కాని మార్పులు చేయడనీ దానికితోడు పవన్ కు త్రివిక్రమ్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా త్రివిక్రమ్ చేత ఈ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ తాను కోరిన విధంగా స్క్రిప్ట్ వ్రాయించుకోలేడు అన్న అభిప్రాయం తెలియచేసినట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో పవన్ దిల్ రాజ్ కు ఒక ఊహించని షాక్ ఇచ్చాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

తన రీ ఎంట్రీ మూవీ కథ ‘పింక్’ లాంటి ఒక సామాజిక చైతన్యం ఉన్న కథ కాకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ సంఘటనలను ఆధారంగా చేసుకుని మూవీగా తీస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీ పాలన వలన జనం పడుతున్న ఇబ్బందులను హైలెట్ చేస్తూ ఆ ఇబ్బందుల గురించి పోరాటం చేసే ఒక ప్రతిపక్ష నేత పాత్రగా తనను చూపెడుతూ ఒక కథ క్రియేట్ చేస్తే బాగుంటుంది అంటూ తన రాజకీయ సలహాదార్లు తనకు సూచించినట్లు పవన్ దిల్ రాజ్ కు చెప్పి షాక్ ఇచ్చినట్లు టాక్. 

దీనితో పవన్ రీ ఎంట్రీ మూవీ దిల్ రాజ్ బ్యానర్ లో అన్న విషయం ఖరార్ అయినా కథ విషయంలో మాత్రం ‘పింక్’ కాదు అన్న లీకులు వస్తున్నాయి. దీనితో ‘పింక్’ రీమేక్ స్క్రిప్ట్ తయారు చేయించాల లేదంటే పవన్ కోరుకున్న రాజకీయ చైతన్యం ఉండే కథ కోసం అన్వేషణ సాగించాల అన్న విషయమై ప్రస్తుతానికి దిల్ రాజ్ కు క్లారిటీ లేని షాక్ పవన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: