ఇండస్ట్రీలో ఒక జానర్ లో సినిమా హిట్ అయ్యిందంటే మేకర్లందరూ ఆ జానర్ లో  కథలని అల్లుకుని వివిధ రకాల ట్రీట్ మెంట్ లతో ప్రేక్షకుల మీదకి వదులుతుంటారు. ఆ విధంగా ఒక్కోసారి మాస్ సినిమాలు, హారర్ సినిమాలు వరుస పెట్టి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఇటు టాలీవుడ్ మొదలుకుని, బాలీవుడ్, కొలీవుడ్ తో సహా  బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి.

 


అయితే ఈ బయోపిక్ లలో కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. వివాదాల వలయంలో పడి కోర్టుల వరకి వెళ్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకానొక సినిమాపై కోర్ట్ స్టే విధించింది. ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకు "చందా.. ఏ సిగ్నేచ‌ర్ ద‌ట్ రుయిన్డ్ ఏ కేరీర్‌" అనే పీరును కూడా కన్ఫర్మ్ చేసి మేకింగ్ మొదలు పెట్టారు. 

 

అయితే ఈ సినిమాలో త‌న‌ను అప‌రాధిగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని పేర్కొంటూ చందా కొచ్చార్ కోర్టును ఆశ్రయించారు. తన మీద ఉన్న కేసు ఇంకా కోర్టులో ఉండగానే సినిమాలో తనని అపరాధిగా చూపిస్తున్నారని తన లాయర్లతో కోర్టును సంప్రదించింది చందా కొచ్చర్. అయితే ఈ సినిమా కోసం చందాకొచ్చర్ ని సినిమా నిర్మాతలు అస్సలు సంప్రదించలేదట. ఈ మేరకు చందా కొచ్చర్ తరపు లాయర్ తన వాదన ని కోర్టుకి వివరించాడు.

 


దీంతో ఈ కేసును ప‌రిశీలించిన కోర్టు సినిమాను వెంట‌నే ఆపాలంటూ చిత్ర యూనిట్‌కి ఆదేశాలిస్తూనే సినిమాపై స్టే విధించింది. ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్ లైన్‌లో కానీ సినిమాను రిలీజ్ చేయ‌వ‌ద్దంటూ, చందా కొచ్చ‌ర్ పేరు ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా కానీ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతీ ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమా ఇప్పట్లో విడుదల అవడమనేది సందేహమే!

మరింత సమాచారం తెలుసుకోండి: