సీనియర్ హీరో మరియు నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రఘుపతి వెంకయ్య నాయుడు’. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. దర్శకుడు బాబ్జి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మండవ సతీష్ బాబు నిర్మిస్తున్నారు. ఈనెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సంధర్భంగా నరేష్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.


 

ఈ చిత్రంలో న‌టించాల‌న్న ఆలోచ‌న ఎప్పుడు వ‌చ్చింది?
మా అమ్మగారికి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు వచ్చినప్పుడు ఆయన విగ్రహం చూసి నాకు స్ఫూర్తి కలిగింది. ఆయన గురించి గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు సినిమా కోసం ఆయన పడిన తపన, ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకున్నాను. వెంటనే దర్శకుడు బాబ్జి కి చెప్పడం, మండవ సతీష్ గారు నిర్మాతగా నేను చేస్తానని ముందుకు రావడంతో ఈ చిత్రం ముందుకు వెళ్ళింది.
 
ఈ చిత్రం కోసం మీరు తీసుకున‌న జాగ్ర‌త్త‌లు?
ఆయన పేస్ కట్స్ కోసం బరువు తగ్గాను, ఆయన ఫొటోస్ ఆధారంగా గెటప్, లుక్ విషయంలో 100శాతం సారూప్యత ఉండేలా చూసుకున్నాం. ఆనాటి పరిసరాల విషయంలో కుడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.

 

రఘుపతి గారి బయోపిక్ లో నటించడం ఎలా అనిపిస్తుంది?
నా అదృష్టం గా భావిస్తున్నాను. ఖచ్చితంగా నాపూర్వజన్మ సుకృతం వలనే నాకు అవకాశం దక్కింది. కృష్ణ గారికి అల్లూరి సీతారామ రాజు లాగా, చిరంజీవి కి సైరా లా, బాలకృష్ణ కు మహానాయకుడిలా నాకు రఘుపతి వెంకయ్యనాయుడు మూవీ అనుకుంటున్నాను.

 

ఆయన వ్యక్తిగత విషయాలను గురించి కూడా ప్రస్తావించారా?
అవును, ఆయన మచిలీపట్టణంలో పుట్టారు, ఆయన మంచి పెయింటర్, ఆయన భార్య నాంచారమ్మ గారు ఒక డాన్సర్. ఆయన కుటుంబలో చాలా మంది ఆర్మీ నేపథ్యం కలిగిన అధికారులు ఉన్నారు. ఈ విషయాలన్నీ చూపించడం జరిగింది.

 

వేదికలపై ఈ మూవీని ప్రదర్శించాలనే ఆలోచనవుందా?
ఖచ్చితంగా ఆ ఆలోచన ఉంది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఈమూవీ ప్రదర్శిస్తాం. అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మూవీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా కోరుతాం.

 

మీరు త‌ర్వాత చిత్రాల గురించి?
గత ఏడాది నేను చాలా మంచి సినిమాలలో నటించాను. ఈ ఏడాది కూడా చాలా బిజీగా ఉన్నాను. త్రివిక్రమ్, సుకుమార్, మారుతీ లాంటి దర్శకులు నాకు మంచి పాత్రలు ఇస్తున్నారు. దీనితో పాటు యంగ్ డైరెక్టర్స్ నన్ను ప్రిఫర్ చేయడం సంతోషం. హీరోలకు తండ్రిగా, అన్నగా అనేక చిత్రాలలో చేస్తున్నాను. మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే నాకు ముఖ్యం.

 

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
ఎస్వీ రంగారావు గారు నాకు స్ఫూర్తి. ఆయనలా ఏపాత్రనైనా చేయగలను అని నిరూపించుకోవాలి. అందుకే రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా పాత్ర మంచిదైతే లక్ష రూపాయలు ఇచ్చినా చేస్తాను. 
నాకు రోల్స్ ముఖ్యం రూపీస్ కాదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: