టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్ఠించిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా విజయ్ దేవరకొండని ఒక స్టార్ గా నిలబెట్టిన సినిమా అని ఖచ్చితంగా చెప్పాలి. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ అందరికి గట్టి పోటీగా నిలబడ్డాడు. ఇక ఇదే సినిమాని సందీప్ డైరెక్షన్ లోనే షాహిద్ కపూర్ కియారా అద్వానీ హీరో హీరోయిన్స్ గా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు షాహిద్ మార్కెట్ ను కూడా ఊహకందనంతగా పెంచేసింది. తెలుగు  హిందీలో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ సినిమాకు హాట్ సీన్స్ విషయంలో ముద్దు సీన్స్ విషయంలో కాస్త రచ్చ జరిగినా ఏ ఇతర సమస్యలు రాలేదు. కాని తమిళ వర్షన్ 'ఆధిత్య వర్మ'కు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఇది నిజంగా ఎవరు ఊహించి ఉండరు.

 

దాదాపు ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ రక రకాల సమస్యలు ఎదుర్కొంటూ రీసెంట్‌గా విడుదలైన తమిళ అర్జున్ రెడ్డి 'ఆధిత్య వర్మ' తమిళ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ధృవ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి కలెక్షన్స్ కూడా వస్తున్న సమయంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా డాక్టర్స్ సంఘం ఫిర్యాదుకు సిద్దం అయ్యింది. సినిమాలో డాక్టర్స్ ను అవమానించినట్లుగా చూపించారంటూ డాక్టర్ల సంఘం తమిళనాడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందట.

 

డాక్టర్లపై ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగేలా ఈ సినిమా ఉందంటూ వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సినిమాలోని అసభ్యకరమైన సీన్స్ ను తొలగించాలని.. లేదంటే సినిమాను మొత్తంగా బ్యాన్ చేయడానికి  ఉద్యమం ఉదృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా నిర్మాతలు లేదా ఇతర టెక్నీషియన్స్ ఎవరు కూడా ఈ విషయంపై స్పందించలేదు. తెలుగు, హిందీలో రాని డాక్టర్ల సమస్య తమిళంలో రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు షాక్ లో  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. మరి ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: