వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు అన్నిటికి సిద్దంగానే ఉంటాడు. తను ఏం చేసినా ముందుగా జరిగే పరిణామాలను బేరీజు వేసుకొనే పని మొదలు పెడతాడు. ఏ క్షణం లో ఎలా మాట్లాడాలో, ఎవరు ఏమడిగితే ఏమని సమాధానం చెప్పాలో ముందుగానే పక్కాగా ప్రిపేర్ అయి ఉంటాడు. అందుకే ఆయన తెరకెక్కించిన సినిమా టైటిల్ విషయంలో ఒత్తిడికి తలవంచక తప్పలేదు. తన కొత్త సినిమా 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' టైటిల్ మార్చడానికి నిర్ణయించుకున్నాడు. ఈ టైటిల్ ని 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చినట్లు తాజా సమాచారం. 

 

అయితే ఈ టైటిల్ లో అసలు ఏమాత్రం కిక్ లేదని వెంటనే కామెంట్స్ పడుతున్నాయి. ఇక కులాల ప్రస్థావనతో అత్యంత వివాదాస్పదంగా టైటిల్ పెట్టి తన సినిమాకు బాగానే పబ్లిసిటీ చేసుకున్నాడు వర్మ. ఐతే ఈ సినిమా విడుదల కి ముందు చిక్కులు తప్పలేదు. కేఏ పాల్ తో పాటు ఇంకో ఇద్దరు ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టుకెక్కారు. అవేమీ పట్టించుకోకుండా వర్మ తన సినిమాను సెన్సార్ సర్టిఫికేషన్ కోసం పంపాడు. ఐతే ఈ టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మార్చాల్సిందే అని ఖచ్చితంగా తేల్చి చెప్పింది.

 

దీంతో కులాల ప్రస్థావన తీసేస్తూ 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ మార్చాడు వర్మ. తన సినిమా టైటిల్ విషయంలో అభ్యంతరాలు తప్పవని వర్మ ఇంతకుముందే అంగీకరించాడు. మరీ గొడవ జరిగితే అక్షరాలు కాస్త అటు ఇటు మార్చి రిలీజ్ చేస్తానంటూ ముందుగానే ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంచనా వేసినట్లే టైటిల్ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టైటిల్ మార్చక తప్పలేదు. దీంతో వర్మ ముందే ఆలోచించి పెట్టుకున్న రెడీ మేడ్ టైటిల్ నే ఇప్పుడు రచ్చ జరగడంతో మార్చేసినట్లు తెలుస్తోంది. 

 

ఇక వాస్తవంగా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్ తో పాటు ఇతర సమస్యల కారణంగా వాయిదా తప్పేలా లేదని సమాచారం. ఇక రెండు నెలల కిందట హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్మీకి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైతే.. చిత్ర బృందం తమకు తాముగా గద్దలకొండ గణేష్ టైటిల్ తో సినిమా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది కేవలం ఒకే ఒక రోజు ముందు జరిగింది. కానీ వర్మ సినిమా కి కాస్త ముందే టైటిల్ మార్చడం కాస్త బెటరే. 

మరింత సమాచారం తెలుసుకోండి: