తన మొదటి సినిమా "పటాస్" తోనే మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఆ తర్వాత మరో సినిమా "సుప్రీమ్" తోనూ మంచి విజయం అందుకున్నాడు అనిల్ రావిపూడి. దీని తర్వాత అతని కెరీర్లో పెద్ద హీరోని దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఆ పెద్ద సినిమానే "రాజా ది గ్రేట్" అటు రవితేజకి, ఇటు దర్శకుడికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది.

 

తను తీసిన ప్రతీ సినిమాలోనూ కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాడు. కామెడీతోనే కథని పరుగులు పెట్టిస్తాడు. కాబట్టే ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ ౨ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడికి మహేష్ తో చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. అనిల్ రావిపూడి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులని తెగ నవ్విస్తుందట.

 

సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రం ఎవరితో చేస్తాడనేది తేలిపోయింది. ఇస్మార్ట్ శంకర్ ద్వారా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఉంటుందని సమాచారం. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రానప్పటికీ అనిల్, రామ్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. ‘రాజా ది గ్రేట్’ చిత్రాన్ని రామ్ తో తీద్దామనే అనిల్ ప్లాన్ చేశాడట.

 

కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు అనిల్, రామ్ కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ‘రెడ్’ సినిమా చేస్తున్న రామ్.. దీని తర్వాత అనిల్ దర్శకత్వంలో నటిస్తాడని అంటున్నారు. ఐతే మహేష్‌తో సినిమా చేసిన వెంటనే రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేస్తే అనిల్ స్థాయి పడిపోతుందని అనేవాళ్లూ ఉన్నారు. కానీ అనిల్ ఇవేవీ పట్టించుకోవట్లేదనే సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: