హైదరాబాద్ లోని శంషాబాద్ పరిసరాలలో డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపిన మానవ మృగాలను వెంటనే ఉరి తీయండి అంటూ భాగ్యనగరంలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని అనేక నగరాలు పట్టణాలు అట్టుడుకి పోతున్నాయి. కేవలం మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడ రంగంలోకి దిగి ప్రియాంక రెడ్డికి జరిగిన దారుణాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన ఒక సామాజిక ఉద్యమంగా మారింది.

ఈ సంఘటన పై కేవలం మన దేశంలోని సామాన్యుల నుండి సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా భారతదేశం రావాలి అంటే భయమేస్తోంది అంటూ కొందరు విదేశీ మహిళలు తమ ట్విటర్ లో కామెంట్స్ చేస్తున్నారు అంటే ప్రియాంక రెడ్డి దారుణ హత్య ప్రపంచ మీడియాను కూడ ఏవిధంగా ప్రభావితం చేసిందో అర్ధం అవుతుంది. మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక రెడ్డి నోరు నొక్కి ఆమెకు మద్యం తాగించి ఆమె కనికరించమని వేడుకుంటున్నా ఆమె పై అఘాయిత్యం చేసిన వార్తలు చదివిన పాషాణ హృదయం కూడ కరిగి పోతుంది.

ఈ సంఘటనను ఖండిస్తూ అనేకమంది టాలీవుడ్ సెలెబ్రెటీలు తమ స్పందన తెలుపుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఛానల్స్ అన్నింటిలోను జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’ ‘టెంపర్’ సినిమాలలో చెప్పిన ఉద్వేగ పూరితమైన డైలాగ్స్ తో ఛానల్స్ హోరెత్తిపోతున్నాయి. ‘అమ్మలా కాపాడుకోవాల్సిన అమ్మాయిల్ని క్రూరమృగాళ్లుగా మీద పడి రేప్‌లు చేసి చంపేస్తుంటే వాళ్లకు తగిన శిక్ష చంపేయడమే’ అంటూ జూనియర్ చెప్పిన డైలాగ్స్ తో మీడియా హోరెత్తిపోతోంది. 

‘ఆడది బయటకు వస్తే చాలు సందుల్లోనూ రోడ్లలోనూ బస్ స్టాప్‌లలోనూ రెస్టారెంట్‌లలోనూ పోస్టాఫీస్‌లలోనూ పార్కుల్లోనూ కాలేజ్‌లలోనూ ఎక్కడపడితే అక్కడ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్లమధ్యలో నుండి నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవడేం చేస్తాడనే భయం సార్ మనకి. మారాలి సార్.. మారాలి.. మారాలంటే ఇది ఆకాశం నుండి ఊడిపడదు సార్.. మనలో రావాలి. మన అందరిలోనూ రావాలి. మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచుకుని కాపాడి కని పెంచినందుకు.. కనీస కృత‌జ్ఞతగా మన చుట్టూ ఉంటే ఈ ఆడవాళ్లని గుండెళ్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్’ అంటూ ఉద్వేగంగా చెప్పిన జూనియర్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఆవేశం ఈ ఉద్వేగం కేవలం రెండు రోజులు తరువాత చల్లారి పోకుండా మహిళలను అమ్మాయిలను ఒక విలాస వస్తువుగా కాకుండా మనకు జన్మను ఇచ్చిన తల్లిగా చూసే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూద్దాం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: