క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు. విడుదలకు సిద్దమైన ఈ సినిమాను నిలిపివేయాలని పలువురు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు అభిప్రాయాన్ని కోరుతూ హైకోర్టు సినిమా విడుదలను వాయిదా వేసింది. ఇప్పుడు ఈ సినిమాను చూసిన బోర్డు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని సినిమా చూసిన సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ సినిమా నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

 

 

కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రారంభిస్తానని దర్శకుడు వర్మ ప్రకటించిన నాటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఏ ఇతివృత్తంతో ఈ సినిమా వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. వారి అంచనాలు అందుకుంటూనే ఈ సినిమాను వర్మ రూపొందించాడని సినిమా మొదటి ట్రైలర్ లోనే తెలిసిపోయింది. రెండో ట్రైలర్ తో మొత్తం తెలుగు సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ సినిమాపై మొదటి పిడుగు టైటిల్ పై పడింది. విడుదల దగ్గర పడగానే జాగ్రత్త పడ్డ వర్మ వెంటనే టైటిల్ ను అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని మార్చాల్సి వచ్చింది.

 

 

అయితే అక్కడితోనే ఆగలేదు. వివాదాస్పద అంశాలున్నాయని రెండు కులాల మధ్య గొడవలు రాజేసేలా ఉన్నాయన్న విమర్శలూ వచ్చాయి. దీంతో సినిమా విడుదలపై ఉత్కంఠ రేగింది. సినిమాలో తన పాత్రను అవహేళన చేసి చూపారని మొదట హైకోర్టును ఆశ్రయించింది కేఏ పాల్. తర్వాత పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా వేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయం చూసి.. రివైజింగ్ కమిటీ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: