బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికీ మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు సీజన్లు ఒకదాన్ని మించి మరోటి సక్సెస్ సాధించాయి. ఈ మూడవ సీజన్ మొదట్లో కొంత డల్ గా కనిపించినా రాను రాను పుంజుకుని టాప్ లోకి వెళ్ళిపోయింది. మూడవ సీజన్ లో టైటిల్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్ల జీవితాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. దానికి కారణం బిగ్ బాస్ క్రేజ్ ని వాళ్ళు సరిగ్గా వాడకపోవడమే.

 

మొదటి సీజన్ లో బిగ్ బాస్ విజేతగా నిలిచిన శివబాలాజీ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అంతకుముందైనా అప్పుడో ఇప్పుడో కనిపించేవాడు. కానీ టైటిల్ గెలిచాక అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఇక రెండవ సీజన్లో  కౌషల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కౌషల్ ఆర్మీ అంటూ ఫ్యాన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ పూర్తయ్యాక కౌషల్ కెరీర్ పూర్తిగా మారిపొతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

 

ఇక మూడవ సీజన్లో విన్నర్ గానిలిచిన రాహుల్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బిగ్ బాస్ పూర్తయిన వెంటనే అతను వరుసగా టీవీ షోలలో పాల్గొంటున్నాడు. పునర్నవి తో కెమిస్ట్రీని బాగా వాడుకుంటూ, ఇద్దరూ కలిసి వరుసగా టీవీ షోలలో కనిపిస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ పూర్తయ్యాక అతడు "అల వైకుంఠపురములో" సినిమాలో ఓ మై డాడి అనే పాటని  కూడా పాడాడు. సాయిధరమ్ తేజ్ సినిమా ప్రతి రోజూ పండగేలో కూడా ఒక పాట ఆలపించాడు. 

 

షో అయ్యాక నెల తిరక్కముందే ఇలా రెండు పెద్ద సినిమాల్లో అవకాశాలందుకుని పాటలు పాడేయడం విశేషమే. తాజా సమాచారం ప్రకారం అతడికి నటుడిగా కూడా ఓ మంచి అవకాశం వచ్చిందట. కృష్ణవంశీ కొత్త సినిమా రంగ మార్తాండలో రాహుల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడట. అందులో ఓ పాట కూడా పాడనున్నాడట. మొత్తానికి బిగ్ బాస్తో రాహుల్ కెరీర్ గొప్ప మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: