తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. పేరుకి చెప్పుకోవడానికి ఒకరిద్దరున్నా వారికి వచ్చిన అవకాశాలు కూడా తక్కువ. అసలు తెలుగు ఇండస్ట్రీలో తెలుగువారే లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. భాష రాని వారిని కేవలం రంగు చూసి తీసుకొచ్చి నటన నేర్పించి మరీ మన మీదకి వదులుతున్నారు దర్శకులు. మరి తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదనేది ఇప్పటికీ సందేహమే.

 

అయితే ఈ విషయం అటుంచితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ జోరు పెంచింది. తెలుగు కుటుంబంలో పుట్టిన తమిళనాడుకి చెందిన ఐశ్వర్యా రాజేష్  తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. తమిళంలో ఘన విజయం సాధించిన "కణ" సినిమా తెలుగు రీమేక్ కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది ఐశ్వర్య రాజేష్. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఐశ్వర్యకి తెలుగులో బాగానే కలిసి వచ్చింది.

 

సినిమా అనంతరం ఐశ్వర్య విజయ్ దేవరకొండతో నటిస్తుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ముగ్గురు కథానాయికల్లో ఒక నాయికగా ఐశ్వర్య ఎంపికైంది. వస్తూ వస్తూనే విజయ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోతో నటించడం ఆమె అదృష్టమే. అయితే అదే తరహాలో మరో సినిమాలో ఐశ్వర్య ఎంపికైంది. నాని హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "టక్ జగదీష్" చిత్రంలో నటిస్తుంది.

 

ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అంతే గాక మరిన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయట. ఈ రెండు చిత్రాలు మంచి విజయాల్ని సాధిస్తే ఐశ్వర్య తెలుగులో మరింత బిజీ అయిపోవడం ఖాయం. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే ఆమె తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయినట్టే. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ నటించిన "మిస్ మ్యాచ్" చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: