అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'అల వైకుంఠపురములో'. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే అల సినిమా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా న్యూస్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఇంటిగుట్టు సినిమాకు మోడ్రన్ వెర్షన్ గా ఈ సినిమా వస్తోందని ఈ మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు విచిత్రంగా మరో సినిమా పేరు తెరపైకొచ్చింది. అదే మలయాళంలో సూపర్ హిట్ అయిన 'మై బాస్' అనే సినిమా.

 

మలయాళంలో దిలీప్, మమతా మోహన్ దాస్ హీరోహీరోయిన్లుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మై బాస్ సినిమా తెరకెక్కించారు. ఇందులో దిలీప్సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, అతనికి బాస్ గా మమతా మోహన్ దాస్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మాదిరిగానే ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమాలో కూడా బన్నీకి బాస్ గా పూజా హెగ్డే కనిపించనుంది. అంతేకాదు, మై బాస్ లో పెళ్లికి వీసా సమస్యలకు ముడిపెడుతూ చిన్న త్రెడ్ ఉంటుంది. అలాంటిదే అల వైకుంఠపురములో కూడా ఉందని న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. అలా అని మై బాస్ సినిమా స్ట్రయిట్ మూవీ కాదు. ఆ సినిమా కూడా అమెరికన్ మూవీ 'ది ప్రపోజల్' అనే సినిమా కు కాస్త దగ్గరగా ఉంటుంది. అల వైకుంఠపురం సినిమాలో అటు ఇంటిగుట్టు, ఇటు మై బాస్ సినిమాల ప్రభావం ఉంటుందని అల యూనిట్ వ్యక్తులే చెబుతుండడం విశేషం అని సమాచారం.

 

అయితే ఇలా ఇన్‌స్పై అయి సినిమాలు చేయడం మన త్రివిక్రమ్ కు కొత్త కాదు. 'లార్గోవించ్' అనే సినిమా ఆధారంగా 'అజ్ఞాతవాసి' తీశాడు. 'మీన' అనే సినిమానే 'అ..ఆ' గా తీశాడు. ఇవే కాదు త్రివిక్రమ్ గత సినిమాల్లో ఒకటైన అతడు సినిమాలో కూడా హాలీవుడ్ మూవీ 'అసాసిన్స్' నాగార్జున నటించిన వారసుడు సినిమాల మాదిరిగా కనిపిస్తాయి. ఈ లెక్కన అల వైకుంఠపురములో 'మై బాస్' ఛాయలు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: