తెలుగు సినిమాల్లో కామెడీ సినిమాలకు ఓ రేంజ్ తీసుకొచ్చిన హీరో రాజేంద్రప్రసాద్. నవ్వుల రేడుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి ఓ దశాబ్దం పాటు కామెడీ హీరోగా తెలుగు సినిమాలను ఏలేశాడు. ఆయన కెరీర్ దశ, దిశను మార్చిన సినిమా లేడీస్ టైలర్. 1986లో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి 33ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ హాస్య ప్రియులు ఈ సినిమాను మర్చిపోలేరు. ఈ సినిమా మొత్తం తూర్పు గోదావరి యాసలో, అక్కడి పచ్చటి పల్లె వాతావరణంలో, గోదావరి తీరంలోనే చిత్రీకరించారు.

 

 

1986 డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ఊళ్లో ఉన్న ఏకైక టైలర్ గా ఆ ఊరి జనానికి తల్లో నాలుకగా ఉండే పాత్రను అత్యద్భుతంగా పోషించాడు రాజేంద్రుడు. జాతకాల పిచ్చితో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే టైలర్ పాత్రలో జీవించాడు రాజేంద్రుడు. సినిమాకు వంశీ కథ ఓ మొక్క అయితే దానికి తనికెళ్ల భరణి మాటలు నీళ్లు లాంటివి. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం ఆ మొక్కను ఎదిగి చెట్టు అయ్యేలా చేసిందని చెప్పాలి. ‘సుజాత మై మర్ జాతా..’ అనే డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పిన రాజేంద్రుడి కామెడీ టైమింగ్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

 

 

ఈ సినిమాతో వంశీ క్రేజీ డైరక్టర్ గా మారిపోయాడు. తనికెళ్ల భరణికి మాటల రచయితగా మంచి పేరు వచ్చింది. దర్శకుడు వంశీ మార్కు ఈ సినిమాతో ట్రెండ్ అయింది. గోదావరి, పల్లెటూళ్లను విపరీతంగా ఇష్టపడే వంశీ ఈ కథను అప్పటి పరిస్థితుల్లో తనకు ఎదురైన అనుభవాలతో రాశారు. తెలుగు కామెడీ సినిమాల్లో ఓ ల్యాండ్ మార్క్ లేడీస్ టైలర్. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: