సినీ పరిశ్రమలో ఒక్కోసారి అవకాశాలు ఎవరికో దక్కబోయి మరొకరికి దక్కుతూంటాయి. వివిధ కారణాలతో అవకాశాలు చేజారిపోవడంతో కొన్ని మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు. అవే అవకాశాలను ఉపయోగించుకుని మరొకరు ఉన్నత స్థానాలకు ఎదిగిపోతారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేని వారు కొందరైతే.. అవకాశాన్ని పట్టించుకోని వారు మరికొందరు. అయితే.. ఖాళీ లేక కూడా కొన్ని అవకాశాలు వదులుకుంటారు. అలాంటి కోవలోకే అరవింద్ స్వామి వదులుకున్నాడు. బిజీ షెడ్యూల్స్ తో ఆయన వదులుకున్న సినిమా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’.

 

 

ఈ సినిమాలో జగపతిబాబు క్యారెక్టర్ కు మొదటగా అనుకున్నది అరవింద్ స్వామినే. అయితే ఆయన తన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా చేయలేనని చెప్పేశాడట. దీంతో ఆ అవకాశం జగపతిబాబుకు వెళ్లింది. అయితే ఈ అవకాశం పోగొట్టుకోవడంతో అరవింద్ స్వామికి నష్టం గానీ, అవకాశం దక్కించుకున్న జగపతి బాబుకు లాభం గానీ లేదు. కాకపోతే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోకు ప్రతినాయకుడిగా స్టైలిష్ యాక్టర్ అరవింద్ స్వామి ఉండుంటే ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యేవారు. జగపతిబాబు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. టామ్ అండ్ జెర్రీ, టిట్ ఫర్ టాట్, ఎత్తుకుపై ఎత్తు.. లా ఉండే ఈ సినిమాలోని సన్నివేశాల్లో ఎన్టీఆర్అరవింద్ స్వామి మధ్య సన్నివేశాలు కొత్తగా ఉండేవనడంలో ఆతిశయోక్తి లేదు.

 

 

కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకున్న సుకుమార్ కు మొదటగా ఈ పాత్రకు ఆయనను భావించడంలో అర్ధం ఉంది. సినిమాను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడంలో సుక్కూ స్టైలే వేరుగా ఉంటుంది. పైగా ఆ సినిమా మరీ క్లాసీగా ఉంటూనే స్క్రీన్ ప్లే ఫిట్ గా ఉంటుంది. దీంతో సుక్కూ ఆలోచన సరైనదే. కానీ ఆ పాత్రలోకి తెలుగు నటుడే వచ్చి చేరాడు. ఇండస్ట్రీలో జోరుగా షికారు చేస్తున్న వార్త ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: