నందమూరి బాలకృష్ణ హీరోగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రూలర్. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న ఈ సినిమాకు సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రూలర్ సినిమా టీజర్ రిలీజైంది. ఒక పాత్రలో బాలకృష్ణ లుక్ బాగానే ఉన్నా పోలీస్ లుక్కు మాత్రం బాలకృష్ణకు అంతగా సూట్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి.
 
గతంలో బాలకృష్ణ పోలీస్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఈ లుక్ మాత్రం ఎక్కడో తేడా కొట్టినట్టనిపిస్తోంది. రూలర్ చిత్ర యూనిట్ బాలయ్య పోలీస్ లుక్కు విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. మాస్ అంశాలకు పెద్దపీట వేసి ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం. రూలర్ సినిమాలో బాలకృష్ణ పాత్ర రెండు కోణాల్లో సాగుతుందని తెలుస్తోంది. గతంలో కే ఎస్ రవికుమార్ బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన జై సింహా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 
 
ప్రస్తుతం రూలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీన వైజాగ్ లోని ఎంజీఎం గ్రౌండ్ లో రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, లిరికల్ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. సీనియర్ నటి భూమిక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక కనిపించనుందని సమాచారం. 
 
చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ధన్ రాజ్, షాయాజీషిండే ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీయార్ బయోపిక్ ఫ్లాప్ కావడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని భావించినా ఆ తరువాత నిర్మాతలు డిసెంబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: