తెలుగునాట తిరుగులేని కధానాయకుడిగా ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఓ చరిత్ర. ఎన్నో పురాణపాత్రల ద్వారా ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. అయితే.. ఆయన కెరీర్లో తీరని కోరికగా ఓ పాత్ర ఉండిపోయింది. అదే.. అల్లూరి సీతారామరాజు.1954లో దర్శక-నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు అగ్గిరాముడు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో వచ్చే ఓ బుర్రకథలో అల్లూరి గురించి  రాసిన ఓ పాట ఎన్టీఆర్ ను ఆకర్షించింది. దీంతో ఆయన అల్లూరి కథ చేయాలని భావించారు.

 

 

అప్పటికే సొంతంగా నిర్మిస్తున్న తోడు దొంగలు తర్వాత ఈ సినిమా నిర్మించాలని భావించారు ఎన్టీఆర్. పడాల రామారావు, జూనియర్ సముద్రాలతో కలిసి స్క్రిప్టు పనులకు శ్రీకారం చుట్టారు. కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలే సాయంతో మేకప్ స్టిల్ కూడా తీశారు. సొంత సంస్థలో అప్పటికే మూడో చిత్రంగా ప్రకటించిన జయసింహ తర్వాత ఈ సినిమాను నిర్మించాలని భావించారు. 1955లో వచ్చిన జయసింహ సూపర్ హిట్ అయింది. 1957లో అల్లూరికి పాట రికార్డింగుతో శ్రీకారం చుట్టారు. పడాల రామారావు రాసిన గీతాన్ని టీవీ రాజు సంగీతంలో రికార్డింగ్ కూడా చేశారు. మళ్లీ ఏవో అడ్డంకుల వల్ల పక్కన పెట్టారు. 1957లోనే వచ్చిన పాండురంగ మహత్యం, తర్వాత సీతారామకల్యాణం విడుదలై ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెంచేసాయి. దీంతో అల్లూరి కథను పక్కన పెట్టారు. అయితే.. వరకట్నం సినిమాతోపాటు అల్లూరిని కూడా సమాంతరంగా తీయాలని భావించినా కుదరలేదు.

 

 

ఈలోపు అల్లూరిని శోభన్ బాబుతో నిర్మించాలని భావించారు కొందరు నిర్మాతలు. కానీ.. ఈ కథ కృష్ణ వద్దకు చేరింది. రచయిత దాశరధితో కథా రూపకల్పన చేసి స్వీయ దర్శకత్వంలో కృష్ణ తన 100వ సినిమాగా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి తీశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత కొన్నాళ్ళకు పరుచూరి బ్రదర్స్ తో అల్లూరిని రాయాలని కోరారట ఎన్టీఆర్. కృష్ణ తీసిన సినిమా చూడాలని పరుచూరి కోరడంతో  మద్రాసులో ప్రత్యేక షో వేశారు కృష్ణ. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అల్లూరు సినిమా ఆలోచనను విరమించుకున్నారు. అయితే.. ఆ పాత్రపై ఉన్న తన కోరికను సర్దార్ పాపరాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో వేసి నెరవేర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: