కమెడియన్ గా మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత హీరోగా కూడా విజయాలందుకున్న నటుడు శ్రీనివాసరెడ్డి. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో సోలో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా హీరోగా వరుసగా అవకాశాలు వస్తాయని ఊహించిన శ్రీనివాసరెడ్డికి కాస్త షాకే తగిలింది. ఎప్పటిలాగే కామెడీ వేషాలు అవకాశం వచ్చాయి తప్ప హీరోగా మంచి ఛాన్స్ మాత్రం రానేలేదు. దాంతో ఆయనే దర్శక, నిర్మాతగా మారిపోయాడు. ఇప్పుడతను దర్శకుడిగా నిర్మాతగా మారి తీసిన సినిమా 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'.  శ్రీనివాసరెడ్డి.. అతడి స్నేహితులైన కమెడియన్లందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి కాస్త బెడిసి కొట్టిందనే అనుకుంటున్నారు. ఇందుకు కారణం అసలు ఇందులో కథే లేకపోవడం. అందునా ఆ కథ బాగా పాత కథ కావడం అని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

హీరోకు ఒక లాటరీ టికెట్ దొరకడం.. అది మిస్ అయితే దాని కోసం పడే పాట్ల నేపథ్యంలో సినిమా అనగానే 90ల నుంచి పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకులకి గుర్తు వస్తాయి. దీనికి డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ జోడించారు. అది కూడా కొత్తగా ఏమీ ఉండదు. ఇక కథనం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కూడా కొంతమంది ఫీలవుతున్నారు. అసలేమాత్రం కసరత్తు లేకుండా.. కథ ఏ రూట్లో సాగుతోందో.. ఏం చెబుతున్నామో చూసుకోకుండా తోచినట్లుగా రాసి.. ఇష్టమొచ్చినట్లుగా తీసుకుంటూ వెళ్లిపోయారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఏం చేయాలో అర్థం కాక తీసింది తీసినట్లుగా ఉంచేసినట్టున్నారు. అంత గందరగోళంగా.. నాన్ సీరియస్ గా సాగుతుందట. షార్ట్ ఫిలింలో తన పక్కన హీరోయిన్ గా నటించడానికి అమ్మాయి దొరక్కపోతే.. సిటీలో ఏ అమ్మాయి దొరుకుతుందా అని చూస్తూ ఒక పాటేసుకోవడంతోనే ఇది ఏ స్థాయి సినిమా అని ఆదిలోనే అర్థమైపోతుందట. 

 

అందుకే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుచుకుంటూ థియోటర్స్ నుండి బయటకు వస్తున్నారట. మరి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఇలాంటి కథ ను ఎంచుకున్నాడో ఆయనకే తెలియాలి.  శ్రీనివాసరెడ్డి - షకలక శంకర్ - సత్య - వెన్నెల కిషోర్ - చిత్రం శీను - సుమన్ శెట్టి - రఘుబాబు - ప్రవీణ్ - సత్యం రాజేష్..ఇలా టాప్ కమెడియన్స్ అందరు ఉన్నా సినిమా దారుణమని ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతున్నారట. ఈ లెక్కన చూస్తే శ్రీనివాస్ రెడ్డికి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు గా చేతులు కాలినట్టే అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: