ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన హీరో కార్తికేయ ఇప్పుడు 90ఎంఎల్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఓ తరహా పాత్రలకే పరిమితం కావడం ఇష్టం లేదంటున్న ఈ కుర్ర హీరో అవసరమైతే ఐటమ్ సాంగ్స్ కైనా రెడీ అంటున్నాడు. ఏ హీరోతో అయినా కాంబినేషన్ కు ఓకే అంటున్నాడు. మంచి పాత్ర దొరికితే చాలు అంటున్నాడు.

 

కార్తి కేయ ఇంకా ఏమంటున్నాడంటే.. “ ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్లకు మనపై తెలియని ఓ ముద్ర పడిపోతుంది. అందుకే నటుడిగా అన్ని రకాల పాత్రలు, అన్ని జోనర్లు చేయాలనుకుంటున్నా. నేను ఎలాంటి పాత్రకైనా సరిపోతాను అనే నమ్మకం రచయితల్లో కలగాలిగించడమే నా లక్ష్యం’’.

 

నేను మాస్‌ కథానాయకుడు అనిపించుకోవాలని ఈ సినిమా చెయ్యలేదు. నటుడిగా అన్ని జోనర్లు చెయ్యాలనుకున్నా. వాటిలో భాగంగానే ఈ చిత్రాన్ని చేశా. కథాంశానికి తగ్గట్లుగా పేరు ‘90.ఎం.ఎల్‌’ అని పెడితేనే బాగుంటుంది అనిపించింది. పేరులో ఓ కొత్తదనం ఉంది కాబట్టి సినిమాపై ఓ ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. కథానాయకులు ఎప్పుడు కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది. రజనీకాంత్, చిరు, మహేష్‌ వంటి హీరోలు నవ్విస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది.

 

నేనూ అది దృష్టిలో పెట్టుకునే వినోదాత్మక సన్నివేశాల్ని పండించా. విమర్శల్ని నేనెప్పుడూ గౌరవిస్తా. అందరి అభిప్రాయాలు వింటా. చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఆ పొరబాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతుంటా. అన్ని సార్లు ‘ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి చిత్రాలు రావు కదా. అది అనుకోకుండా దక్కిన వరం. ‘90.ఎం.ఎల్‌’ విషయంలో రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ నా నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్‌ ప్లే పరంగా కొన్ని లోపాలున్నట్లు నా దృష్టికొచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతా.. అంటున్నాడీ కుర్ర హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: