ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యంగ్ హీరో కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయాడు. తాజాగా 90 ఎంఎల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విమర్శల్ని నేనెప్పుడూ గౌరవిస్తా. అందరి అభిప్రాయాలు వింటా. చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఆ పొరబాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతుంటా. అన్నిసార్లు ‘ఆర్‌ఎక్స్‌ 100′ లాంటి చిత్రాలు రావు కదా. అది అనుకోకుండా దక్కిన వరం. ’90.ఎం.ఎల్‌’ విషయంలో రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ నా నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్‌ ప్లే పరంగా కొన్ని లోపాలున్నట్లు నా దృష్టికొచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతా” అని చిత్ర కథానాయకుడు కార్తికేయ అన్నారు. శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శత్వం వహించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో కార్తికేయ మాట్లాడారు.

 


ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం?
నేను మాస్‌ కథానాయకుడు అనిపించుకోవాలని ఈ సినిమా చెయ్యలేదు. నటుడిగా అన్ని జోనర్లు చెయ్యాలనుకున్నా. వాటిలో భాగంగానే ఈ చిత్రాన్ని చేశా. చిన్నప్పుడు చిరంజీవిగారిని మాస్‌ చిత్రాల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఆనందించే వాడిని. ఆయనలా నన్ను నేను ఎలాంటి పాత్రల్లో చూసుకోవాలి అనుకున్నానో అలాంటి పాత్రల్లో ఇది ఒకటి. తెరపై చూసుకుంటున్నప్పుడు నేను చాలా ఎంజాయ్‌ చేశా.

 

మూవీ రిజల్ట్ ఎలా అనిపించింది?
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో చిత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆద్యంతం ఆ వినోదాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.


టైటిల్‌ వల్ల ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు దూరం అవుతుందని అనిపించలేదా?
ముందుగా ‘దేవదాస్‌.. పార్వతీపురం’ అనే పేరు అనుకున్నాం. ఆ తర్వాత కథాంశానికి తగ్గట్లుగా పేరు ’90.ఎం.ఎల్‌’ అని పెడితేనే బాగుంటుంది అనిపించింది. పేరులో ఓ కొత్తదనం ఉంది కాబట్టి సినిమా పై ఓ ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. మరో విషయం ఏంటంటే దీన్ని మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా రూపొందించాం. మేం అనుకున్నట్లుగానే ఇది వాళ్లకు చేరింది.

 

మీరు డ్యాన్స్‌లు చేయరుగదా. ఈ సినిమాకోసం ఏమైనా ప్రత్యేక కసరత్తులు చేశారా?
నాకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవి సర్‌ చిత్రాల్లోని పాటలకు స్కూల్‌, కాలేజీల్లో వేదికలపై డ్యాన్స్‌ చేసేవాడిని. అయితే నా తొలి మూడు చిత్రాల్లో నృత్యాలు అంత ప్రాధాన్యత దొరకలేదు. ఈ చిత్రంలో దొరికింది. అందుకే నా పూర్తి ప్రతిభను చూపించా. ఇక వినోదం విషయానికొస్తే.. కథానాయకులు ఎప్పుడు కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది.

 

‘గ్యాంగ్‌లీడర్‌’లో ప్రతినాయకుడిగా చేశారు. మళ్లీ అలాంటి అవకాశమొస్తే చేస్తారా?
కచ్చితంగా చేస్తాను. నాకు నటన అంటే ఇష్టం. నటుడిగా ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. కానీ, విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు దానికొక ప్రాధాన్యత ఉండాలి. సినిమాకీ నాకూ ఆ పాత్ర ఉపయోగపడేలా ఉండాలి. ఏదో హీరోతో నాలుగు ఫైట్లు చేసేసి వెళ్లిపోయేటట్లు ఉండకూడదు. మనసుకు నచ్చాలే కానీ ఐటెం గీతాలకైనా రెడీనే.

 

ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?
ఇద్దరు కొత్త దర్శకులతో చెయ్యబోతున్నా. ఒకటి యాక్షన్‌ థ్రిల్లర్‌. మరకొటి భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త ప్రేమకథ. త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తా.

 

‘దిశ’ హత్యాచార ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మీ ‘గుణ 360’ క్లైమాక్స్‌ సన్నివేశాలు వైరల్‌ అయ్యాయి. దాని పై మీ అభిప్రాయం?
నిజానికి ఆ సన్నివేశాల్ని ప్రజలు అలా స్టేటస్‌లు పెట్టుకోవడం చూసి నేను కాస్త బాధ పడ్డా. ఆ సినిమాలో ఓ నటుడిగా హత్యాచార నిందితులను శిక్షించానే తప్ప, నిజ జీవితంలో దిశ ఘటనపై ట్వీట్‌ చేయడం తప్ప ఏం చెయ్యగలుగుతున్నా అనిపించింది. ఇక‌పోతే మాస్ పాత్ర‌ల‌ను ముఖ్యంగా చేయ‌డానికి కార‌ణం చిన్న‌ప్ప‌టి నుండి ర‌జ‌నీకాంత్‌, చిరంజీవిల మాస్ సినిమాలు ఎక్కువ‌గా చూసేవాడ్ని నాకు కూడా అలా చేయాల‌ని కోరిక ఎప్ప‌టికైనా వాళ్ళ‌లాగా న‌టించాలి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: