సైరా సినిమాతోనే పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. ఆ సినిమాలో ఈ కీలక పాత్రలో పవన్ కనిపిస్తాడనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. అదంతా నిజమనే విషయాన్ని బయటపెట్టారు సైరా రచయిత పరుచూరి గోపాలకృష్ణ. సినిమాలో పవన్ కోసం తను రాసుకున్న సన్నివేశాన్ని పరుచూరి బయటపెట్టారు. "సైరాలో చిరంజీవి చనిపోయిన తర్వాత ఆ రక్తపు చుక్కలు కారుతుంటే, వాటిని చీర చెంగులో పడుతూ  లక్షమంది పుడతారంటూ ఆ తల్లి చెబుతుంది. అప్పుడు ఓ ఐదారుగురు నాయకులు అలాఅలా వచ్చేసి, జాతీయ జెండా ఎగిరే సీన్ చూపిస్తాం. 

 

అప్పుడు 2 కాళ్లు  అలా నడుచుకుంటా కొండపైకి వెళ్తాయి. ఆ కాళ్లు ఎవరు..ఎవరు.. అని అంతా చూస్తుంటారు. అలా తిరిగేసరికి పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. అలా ఆకాశంవైపు చూసి పెద్దాయన అంటాడు. ఆ మబ్బుల్లోంచి చిరంజీవి రూపం వస్తుంది. అప్పుడు చిరంజీవి మీసం తిప్పుతారు. అక్కడ పవన్ కు 2 డైలాగ్స్ ఉంటాయి." తను రాసుకున్న స్క్రిప్ట్ లో ఆ సీన్ ఉందని, కానీ ఆ సన్నివేశం పెట్టడానికి చిరంజీవి ఒప్పుకోలేదన్నారు. ఆ తర్వాత చరణ్ ను ఆ సీన్ చేయమని కోరానని, చిరంజీవి ఒప్పుకుంటే అభ్యంతరం లేదని అతడు కూడా తప్పించుకున్నట్టు గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆ ఒక్క సీన్ పెట్టినట్టయితే, తను నూరుపాళ్లు సంతోషం వ్యక్తం చేసేవాడినని అన్నారు. పవన్ కనిపించకపోయినా ఆయన గొంతు వినిపించినందుకు సంతోషమన్నారు.

 

పరుచూరి పలుకుల్లో భాగంగా తన తన అభిప్రాయాలను వెల్లడించిన గోపాలకృష్ణ, సున్నితంగా సురేందర్ రెడ్డిపై విమర్శలు చేశారు. తను రాసుకున్న స్క్రిప్ట్ ను సురేందర్ రెడ్డి చాలా మార్చేశాడంటూ మచ్చుకు కొన్ని సన్నివేశాల్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, చిరంజీవి అనుమతిస్తే, తన ఒరిజినల్ స్క్రిప్ట్ ను పుస్తకంగా ముద్రించుకుంటానంటున్నారు పరుచూరి. మరి అదే గనక జరిగితే మెగా ఫ్యాన్స్ కి పండగే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: