దేశంలో ఎక్కడ చూసినా ‘ఉల్లి’కి సంబంధించిన వార్తలే దర్శనమిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం రూ. వందల్లో పలుకుతుండటంతో రోజూ దేశంలో ఎక్కడో ఓ చోట ఉల్లి కి సంబంధించిన వార్తలు ఘాటెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఉల్లి ఎంత పని చేస్తోందంటే జనాలను దొంగలను చేస్తోంది. అంతేకాదు కొందరు దొంగల్ని సైతం పోలీసులకు పట్టిస్తోంది. దాంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. 'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు' అన్న సామెతలా ఉంది వ్యవహారం. ఇలాంటి వింత ఘటనే ఇటీవల పంజాబ్‌లోని కపూర్థలాలో చోటుచేసుకుంది. 

 

అర కిలో ఉల్లిపాయలను చోరీ చేసేందనే ఆరోపణలతో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో కిరణ్ అనే మహిళ ఉంటోంది. కొంతకాలంగా తమ ఇంట్లో సామాను చోరీకి గురవుతున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రేఖ అనే మహిళ తన ఇంట్లో పనిచేస్తోందని,  ఆమె చోరీలకు పాల్పడుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఎవరు చోరీలు చేస్తున్నారో తెలుసుకునేందుకు కిరణ్ ఇంట్లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేసింది. బయట ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో రేఖ అర కిలో ఉల్లికి కక్కుర్తిపడి ఎప్పటి మాదిరిగానే తన సత్తా చూపించింది. ఈ విషయం కెమెరాలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ పోలీసులకు ఇచ్చింది. దీంతో వాళ్ళు రేఖను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించగా, ఆమె తప్పును ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని దొంగతనాలు చేసినా దొరకని దొంగ.. చివరకు ఉల్లి వల్ల పట్టుబడి ఊచలు లెక్కపెడుతోంది. ఈ సంఘటనను బట్టి అర్థమవుతుంది ఏమిటంటే మన ఇళ్ళల్లో ఖరీదైన వస్తువుల దగ్గర్నుంచి నిత్యావసర వస్తువుల వరకు దొంగిలించడానికి ఎక్కడో బయట నుంచి రారని..ఇంట్లో వాళ్ళే..ఇంట్లో పనివాళ్ళే దొంగిలిస్తారని. 

మరింత సమాచారం తెలుసుకోండి: