ఏదో విధంగా ఆర్జీవి అమ్మరాజ్యంలో వ్యవహారం కొలిక్కి వచ్చింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ ని కాస్తా మార్చుకుని, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ తో అన్ని రకాల అవాంతరాలు దాటి థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది. ఓ పక్క కోర్టు కేసులు, దానిపై రకరకాల వాదనలు, సెన్సారు వ్యవహారాలు, అధికారుల అడ్డంకులు ఇలా అన్నీ కంప్లీట్ అయిన తరువాత సినిమా థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ ఓ చిన్న విడియో బైట్ ను ప్రేక్షకుల ముందుకు వదిలారు.

 

తన సినిమాను అడ్డుకోవడానికి తెరవెనుక ఎవరో విపరీతంగా ప్రయత్నాలు చేశారని, కుట్రలు పన్నారని, డబ్బులు ఖర్చు చేసారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఈ కుట్రలన్నిటిని బయట పెడతానని అవసరం అయితే లీగల్ యాక్షన్ కు కూడా దిగుతామని హెచ్చరించారు. సాధారణంగా ఆర్జీవి ఎప్పుడు ఇలా ఎమోషనల్ అవరు. కానీ ఎందుకనో ఈ సారి ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఇంతలా ఆవేదన చెందుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరు ఈ సినిమాకు బ్రేక్ వేయడానికి ప్రయత్నించారు అన్నది ఆర్జీవి తెలపాల్సి ఉంది. రెండు సామాజిక వర్గాల మధ్య అధికార పోటీ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా తీసిన సినిమా అన్న వదంతులు వున్నాయి. 

 

అందువల్ల ఆ సామాజిక వర్గం తరపున ఎవరన్నా అడ్డం పడ్డారా? అన్న అనుమానాలు ఆర్జీవికి వస్తున్నాయట. నిజానికి రెండు రాష్ట్రాల్లో ఆ వర్గం అధికారంలో లేదు. మరి ఎవరు అడ్డుకున్నట్లు? వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం అదే సామాజిక వర్గానికి చెంది, పార్టీ మారి, అధికార పక్షం వైపు వెళ్లి, ఏదో విధంగా తనపై కేసుల నుంచి విముక్తి పొందాలని ప్రయత్నిస్తున్న నాయకుడే, గట్టిగా ఖర్చుచేసి, సినిమాను అడ్డుకోవాలని చూసారని సమాచారం అందుతోంది. మరి ఆర్జీవీ మాటలు కూడా ఈ గుసగుసలకు బలం చేకూరుస్తున్నాయి. ఆర్జీవీ లేదా సినిమా నిర్మాతలు బాహాటంగా గొంతు విప్పితే తప్ప, ఆ ఎవరు అన్న దానికి సమాధానం తెలియదు. ఏదేమైనా ఆర్జీవి అమ్మరాజ్యంలో సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: