ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు(80) క‌న్నుమూశారు. చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గొల్లపూడి మరణవార్తతో విషాద ఛాయలు నెలకొన్నాయి. నటీనటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. అయితే గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇక 13 ఏళ్ల వ‌య‌స్సులోనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు. వాస్త‌వానికి ఒక రంగంలో రాణించడమే కష్టమైన ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో పరిపూర్ణత సాధించిన బహు కళా ప్రపూర్ణుడు గొల్లపూడి మారుతీరావు. 

 

ఆయనో విలక్షణ నటుడు, హాస్యనటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు. ఇలా పలు రంగాల్లో రాణించి విశాఖ నగరానికి కీర్తి తెచ్చారీ పెద్దాయన. అయితే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య చిత్రంతో గొల్ల‌పూడి సినీ ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యారు.  కడుపుబ్బా నవ్వించే కామెడీ అయినా, విషం కక్కే విలనిజం అయినా, కంటతడి పెట్టించే పాత్రలోనైనా ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా నటవిశ్వరూపాన్ని చూపించగల నటుడు గొల్లపూడి మారుతి రావు. రచయితగా ప్రసిద్ది చెందిన గొల్లపూడి సినిమాల ద్వారా అందరికీ సుప్రసిద్దులయ్యారు. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో గొల్లపూడి ప్రత్యేక శైలిని అవలంభిస్తారు.

 

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా, మారుతీరావుకు  1961 నవంబరు 11న శివకామసుందరితో వివాహం జ‌రిగింది. వీరికి ముగ్గురు మగసంతానం. ఇక సినీ రంగంలో ఆయ‌న దాదాపు 250 సినిమాల‌కు పైగా ఆయ‌న న‌టించారు. కాగా, గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ వార్త తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆయనను కలిసి పరామర్శించారు. అయితే ఈ రోజు గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాసవిడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: