గొల్లపూడి మారుతీరావు..... తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. కాసింత విలనిజం, మరికొంత కుత్సితం, ఇంకొంత హాస్యం కలగలిపితే... ఆయన సినిమాలో పోషించిన పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ అయినా.. విషం కక్కే విలనిజం అయినా... కంటతడి పెట్టించే కరుణరసమైనా... నటవిశ్వరూపాన్ని చూపించగల నటుడు గొల్లపూడి. మధ్యతరగతి ఇంటి పెద్దగా... దారి తప్పిన మధ్య వయస్కుడిగా.. కాళ్లూచేతులూ బావున్నా.. ఎవరో ఒకరిని మోసం చేసే మాయగాడిగా... ఆయన వెండితెరపై జీవించారు. గద్దముక్కుపంతులు అన్నా.. సింగిల్ పూరీ శర్మ అన్నా చటుక్కున ఆ పాత్రలే గుర్తొస్తాయి తప్ప.. గొల్లపూడి కానే కాదు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్న గొల్లపూడి... ఒక్కోమాటను విరుస్తూ మాటలు చెబుతుంటే వెండితెర సైతం ఆస్వాదించేది.


తెలుగు సినీ చరిత్రలో 80వ దశకంలో ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజం చూపించిన నటుడు గొల్లపూడి మారుతీరావు. తర్వాత పలు విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రముఖ కవి దాశరథి ప్రోత్సాహంతో సినీ రచయితగా మారిన గొల్లపూడి మారుతీరావు... తొలిసారి 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. తొలి ప్రయత్నంలోనే ఆ కథారచనకు నంది అవార్డు లభించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.


నటించిన తొలి చిత్రంతోనే విశేషంగా ఆకట్టుకున్న గొల్లపూడి... ఆ సినిమా ఘన విజయం తర్వాత వెనుదిరిగి చూడలేదు. దాదాపు 290 చిత్రాలకు పైగానే సహాయ నటుడిగా, హాస్య నటుడిగా, విలన్ గా.. వివిధ పాత్రల్లో మెప్పించారు. 42 ఏళ్ల వయసులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి... మూడున్నర దశాబ్దాలకుపైగా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. గొల్లపూడికి దర్శకుడు కోడి రామకృష్ణ పెట్టిన గద్దముక్కు పంతులు పేరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత.. సుందరకాండ చిత్రంలో దర్శకుడు రాఘవేంద్రరావు ఆయన్ను సింగిల్ పూరీ శర్మగా మార్చారు.


రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యతో పాటు సహ విలన్‌గా గొల్లపూడి ఎన్నో సినిమాల్లో విలనిజం పండించారు. ఈ దుష్ట త్రయం ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. ఒక దశలో గొల్లపూడి ఒక్క సంవత్సరంలోనే 31 సినిమాల్లో నటించారంటే ఆయన నటనలో ఎంతగా రాణించారో అర్థం చేసుకోవచ్చు. తన మూడో చిత్రంలోనే గొల్లపూడి ద్విపాత్రాభినయం చేశారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, మనిషికో చరిత్ర, యముడికి మొగుడు, స్వాతిముత్యం, స్వాతి, గూఢచారి నెంబర్ వన్, ఆలయ శిఖరం, అభిలాష, పల్లెటూరి మొనగాడు, ఛాలెంజ్, ప్రేమ, ఆదిత్య 369, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369, సుందరకాండ, బ్రోకర్, లీడర్ వంటి చిత్రాలు గొల్లపూడికి బాగా పేరు తెచ్చాయి. వజ్రం, మురారి, దరువు, సుకుమారుడు, రౌడీ ఫెలో, కంచె, సైజ్ జీరో, మనమంతా, ఇజం వంటి మరికొన్ని చిత్రాల్లోనూ గొల్లపూడి ఆకట్టుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'జోడి'.


డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినీ రంగంలో ప్రవేశించిన గొల్లపూడి... రైతు కుటుంబం, దొరబాబు, ఓ సీత కథ, అన్నదమ్ముల అనుబంధం, శుభలేఖ, కళ్లు వంటి చిత్రాలకు కథ అందించారు. వెండితెరపైనే కాకుండా... బుల్లి తెరపైనా గొల్లపూడి నటనా ప్రతిభ ప్రకాశించింది. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరిగోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం? వంటి సీరియళ్లలో నటుడిగా మెప్పించారు.


అద్భుత నటనా కౌశలంతో గొల్లపూడి మొత్తం 6 నంది పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా.... తరంగిణి చిత్రంలో ఉత్తమ హాస్యనటుడిగా.. 'రామాయణంలో భాగవతం' చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నందులు అందుకున్నారు గొల్లపూడి. తన చిన్నకుమారుడు దర్శకత్వం వహించిన ప్రేమపుస్తకం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లేకు నంది అందుకున్న ఆయన.. 1996లో ఉత్తమ టీవీ నటుడిగా బుల్లితెర నంది పురస్కారం స్వీకరించారు.


1992 ఆగస్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో మరణించారు. తన కుమారుని జ్ఞాపకంగా మారుతీరావు... గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ఏటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి లక్షన్నర రూపాయల నగదు బహుమతిని అందించారు.


గొల్లపూడి మారుతీరావు సినీనటుడిగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయనో గొప్ప సాహితీవేత్త. కవిగా, రచయితగా, నాటక కర్తగా, జర్నలిస్టుగా, వక్తగా పేరు సంపాదించారు. ఆకాశవాణిలో దాదాపు రెండు దశాబ్దాలపాటు సేవలందించారు. తెలుగు సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి.


పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. గొల్లపూడి మారుతీరావు కూడా అంతే. 13ఏళ్ల చిన్న వయసులోనే ఆయన ఆలిండియా రేడియోలో పనిచేశారు. 14 ఏళ్ల వయసులో 'ఆశా జీవి' పేరుతో గొల్లపూడి తన మొదటి కథ రాశారు. ప్రొద్దుటూరులోని స్థానిక పత్రిక 'రేనాడు' దాన్ని ప్రచురించింది. ప్రారంభ రోజుల్లో గొల్లపూడి కవిత్వం ఎక్కువగా రాశారు. అవి 'మారుతీయం' పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. గొల్లపూడి మొత్తం 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు రాశారు. జీవన కాలమ్ పేరుతో అనేక వ్యాసాలు రాశారు.


1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంచాలకుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు గొల్లపూడి. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన గొల్లపూడి.... మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై గొల్లపూడి రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి.


ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికైన గొల్లపూడి.... హైదరాబాద్, విజయవాడల్లో పని చేశారు. తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందాక... సంబల్ పూర్, చెన్నై, కడపలో పనిచేశారు. ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా 1981లో పదోన్నతి పొందిన ఆయన... మొత్తం రెండు దశాబ్దాలపాటు రేడియోకు సేవలందించారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసి సినీరంగంలో ప్రవేశించారు. రచయిత, నటుడు, కథకుడు, నాటక రచయిత, నవలాకారుడు, రేడియో ప్రయోక్త, కాలమిస్టు, సాహితీవేత్త.. ఇలా గొల్లపూడి ప్రతిభ బహుముఖీనం.


విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించిన గొల్లపూడి... రాఘవ కళానికేతన్ పేరుతో నాటక బృందానికి నాయకత్వం వహించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గోపాలస్వామి దర్శకత్వంలో స్నానాలగది నాటకంలో తొలిసారిగా నటించిన గొల్లపూడి... పలు నాటకాలకు రచన, దర్శకత్వ సహకారం అందించారు. 1959లో దిల్లీలో ఆకాశవాణి నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు బహుమతి అందుకున్నారు గొల్లపూడి. ప్రశ్న అనే నాటకానికి అఖిలభారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం అందుకున్నారు. 2015లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: