తెలుగు తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలకు జీవం పోసిన సీనియర్‌ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీ రావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది.  సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు.  వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.

 

తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.  సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు.  

 

రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశాడు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లాడు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు.  

 

తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి. కుటుంబలో ఎంతో పెద్ద విషాదం జరిగినా.. చెక్కుచెదరని మనోధైర్యాన్ని ప్రదర్శించారు. మారుతి రావుకు ముగ్గురు సంతానం. ఆయన కుమారుడు శ్రీనివాస్‌ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్‌ మరణించారు. ఆయన పరిచయం చేసిన హీరోనే అజిత్.. ఇప్పుడు కోలీవుడ్ లో సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు.  తనయుడి జ్ఞాపకార్థం ఉత్తమ దర్శకులకు జాతీయ అవార్డును అందజేస్తూ వస్తున్నారు గొల్లపూడి.

 

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తో ఆయన నట ప్రస్థానం ఎంతో గొప్పగా సాగింది.   250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు. యముడికి మొగుడు, ప్రేమ, మనిషికో చరిత్ర, స్వాతి ముత్యం, చాలెంజ్‌, ఆళయశిఖరం, త్రిశూలం, శుభలేఖ, ఆదిత్య 369, కంచె, సైజ్‌ జీరో, మనమంతా, జోడీ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. టెలివిజన్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన గొల్లపూడి పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. 1996లో ఉత్తమ టెలివిజన్‌ నటుడిగానూ నంది అవార్డు అందుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్‌ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గొల్లపూడి మారుతీరావు మృతికి సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: