టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.. రచయిత, నటుడు, ప్రయోక్త, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ...చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  తెలుగు తెరపై ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన సీనియర్‌ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీ రావు లేరన్న విషయం తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేక పోతుంది.  ఒక్క మాట విరుపుతో పలు అర్థాలు ధ్వనింపజేసే ఆయన తన ఎనభై ఏళ్ల జీవన ప్రస్థానంలోని ఎన్నో అద్భుతాలు సృష్టించారు.  ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో మర్చిపోలేని ఓ సంఘటన ప్రస్తావించారు. పదిహేడేళ్ల వయసులో మొదటిసారి ‘అనంతం’ నాటకం రాసి, వేశానని.. అయితే అప్పట్లో నాటకాలు వేయడం అంత సామాన్య విషయం కాదని అన్నారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, మాధవపెద్ది వెంకట్రామయ్య గార్ల వంటి మహామహులకే నాటకాలు వేయటం చెల్లింది.

 

ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో అప్పటి సమాచార, ప్రసారశాఖ మంత్రి బి.వి.కేస్కర్‌ గారి చేతుల మీదుగా రూ.100 బహుమతి అందుకున్నా. ఈ గుర్తింపే ఆకాశవాణిలో ఉద్యోగానికి అర్హుణ్ణి చేసిందని అన్నారు. అప్పట్లో భారత్‌పై చైనా దురాక్రమణ నేపథ్యంలో ఒక నాటిక రాయమని కలెక్టర్‌ బి.కె.రావు నన్ను కోరారు.  ఆ నాటకానికి ‘వందేమాతరం’ అని పేరునూ సూచించారు. చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లిలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.  అయితే తిరుపతిలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో నాకు చాలా కోపం వచ్చింది.. అక్కడి తహసీల్దారు మీద, మిగతా ఉద్యోగుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాను. ఆ సమయానికి బీకే రావు గారు వచ్చి.. ఆయన తహశీల్దారు.. మిగతావారు మంచి ఉద్యోగంలో ఉన్నవారు.. ఒకవేళ నీ వెంట కలెక్టర్ లేకుంటే కనీసం వారిని కలవడానికి కూడా నీకు సమయం ఉండదు...సాధ్యపడదు అన్నారు.

 

ఎప్పుడూ నీ దృష్టితో సమస్యలను చూడకు. ఎదుటివాడి దృష్టితో చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.  ఇంకా నువు గొప్ప రచయితవి కాలేదు... ప్రతిభా నీలో ఉన్నాయి. భగవంతుడు మంచి వాక్యం రాసే ప్రతిభని నీకిచ్చాడు. దాన్ని ఇంకా మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నించు.. ఈసారి నిన్ను కలిసినప్పుడు కొత్త మారుతీరావుని చూస్తానని ఆశిస్తాను అన్నారు.  అంతే ఆ ఒక్క సంఘటన నన్ను నేను తెలుసుకునేలా చేసింది.. నా స్థాయి గుర్తు చేసింది. అది నా దృక్ఫథాన్ని మార్చింది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.  ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: