వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ నటించగా నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటించింది. రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లు అయిన వెంకటేష్, నాగ చైతన్య సినిమాలో కూడా అవే క్యారెక్టర్లలో నటించడం గమనార్హం. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ వస్తోంది. 
 
ఈ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య నటనతో తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ సినిమాలో నాగచైతన్య పాత్ర కంటే వెంకటేష్ పాత్రకే దర్శకుడు ఎక్కువగా స్కోప్ ఇచ్చాడు. పేరుకు మల్టీస్టారర్ అయినప్పటికీ నాగచైతన్య పాత్రకు దర్శకుడు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. సినిమాలో నాగచైతన్య పాత్ర గెస్ట్ రోల్ లా ఉందనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతున్నాయి. 
 
వెంకటేష్, నాగచైతన్య కనిపించే కొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. పాయల్, రాశీఖన్నా సినిమాలో పోటాపోటీగా నటించారు. సినిమాకు వెంకీ, నాగచైతన్య నటన ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ట్రాక్స్ ప్లస్ పాయింట్లు కాగా స్క్రీన్ ప్లే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపించడం మైనస్ అయ్యాయి. క్లైమాక్స్ లో వెంకీ, చైతన్యల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. 
 
థమన్ ఇచ్చిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాకు ప్రసాద్ మూరెళ్ల అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు బాబీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తగ్గించి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా బాబీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరో రేంజ్ కు వెళ్లేదని చెప్పవచ్చు. ఈ వారాంతానికి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి మాత్రం వెంకీమామ సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. థియేటర్లలో వెంకీ మామకు పోటీనిచ్చే సినిమా కూడా లేకపోవడం వెంకీమామకు కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: