బాహుబలి సినిమా వచ్చినప్పటి నుండి ప్రతీ ఇమ్డస్ట్రీ వారికి అలాంటి సినిమా తీయాలన్న కసి పెరిగింది. చాలా మంది దర్శకులకి బాహుబలి లాంటి సినిమా తీయాలని కలగా ఉంది. అలా తీసే ప్రయత్నాలు చాలా జరిగినప్పటికీ ఏ ఒక్కటీ కూడా బాహుబలిని చేరుకోలేకపోయాయి. బాలీవుడ్ లో బాహుబలిని దాటడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కటీ సక్సెస్ కాక చతికిల పడుతున్నారు.

 

ఇకపోతే మళయాల ఇండస్ట్రీ నుండి బాహుబలి లాంటి సినిమా రిలీజైంది. బాహుబలి దాటేద్దామనే కాంక్షతో కాకుండా బాహుబలి లాంటి సినిమా మేమూ తీయగలం అన్న నమ్మకంతో వచ్చిన సినిమా ఇది. సాధారణంగా మళయాల సినిమాలు చాలా సున్నితంగా ఉంటాయి. కానీ అలాంటి పోకడలకి పోకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన చిత్రం " మమాంగం". ఇది ఓవరాల్‌గా ‘బాహుబలి’ని కొట్టేస్తుందని కాదు కానీ.. ప్రమాణాల పరంగా ఆ స్థాయిలో నిలుస్తుందని.. కేరళ వరకు ‘బాహుబలి’ని మించిన సక్సెస్ సాధిస్తుందని అంచనా వేశారు.

 

ఐతే సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘మామాంగం’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. మామాంగం అనే ప్రాచీన యుద్ధ కళ నేపథ్యంలో భారీగానే ఈ సినిమాను తీశారు కానీ.. ప్రేక్షకుల్ని ‘బాహుబలి’లా అలరించడంలో మాత్రం ఈ సినిమా విఫలమైంది. మాస్ ప్రేక్షకులకు, మమ్ముట్టి అభిమానులకు నచ్చే కొన్ని మూమెంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా చూస్తే సినిమా చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు.

 

మళయాలంతో పాటు తెలుగు, కన్నడ , తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇతర భాషల్లో కనీస ఆదరణ కూడా దక్కించుకోలేదు. ప్రమోషన్స్ లోపమో, లేక మరింకే కారణమో తెలియదు కానీ ఇతర భాషల్లో ఈ సినిమాకి అంతగా ఆదరణ కనిపించట్లేదు. కేరళలో మాత్రం మొదటి రోజు వసూళ్ళు బాగానే వచ్చాయని సమాచారం.  బాహుబలి లాంటి సినిమాలు రావాలంటే అందుకు తగ్గ సమయం, కథ, తెరకెక్కించే దర్శకులు కావాలి. అది జరగాలంటే మళ్ళి రాజమౌళినే రావాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: