బాలీవుడ్ కాంట్రవర్సీ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ ఇంట్లో బాంబుందని పదహారేళ్ల బాలుడు పోలీసులకు నకిలీ ఈ మెయిల్‌ పంపాడు. ముంబైలోని బాంద్రా ఏరియాలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్‌ఖాన్‌ ఇంట్లో పెట్టిన బాంబు రెండు గంటల్లో పేలనుందని, ఆపే సత్తా ఉంటే ఆపుకోమని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు ఈ నెల 4న ఈమెయిల్‌లో సవాల్‌ విసిరాడు.  మీకు ఈమెయిల్ అందిన రెండు గంటల్లో సల్మాన్ ఇంట్లో బాంబు పేలబోతుందని, దమ్ముంటే ఆపాలని అందులో పేర్కొన్నాడు.  ఈమెయిల్ అందగానే స్థానిక ఏసీపీ సహా పలువురు పోలీస్ అధికారులు,బాంబ్ డిటెక్షన్&డిస్పోజబుల్ స్క్వాడ్ సల్మాన్ ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.  

 

పోలీసులు గెలాక్సీ అపార్టుమెంటుకు వచ్చినపుడు ఇంట్లో హీరో సల్మాన్ ఖాన్ లేరు. పోలీసులు వెంటనే గెలాక్సీ అపార్టుమెంటులోని సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీం, సల్మాఖాన్, ఆయన సోదరి అర్పితలను బయటకు పంపించారు. పోలీసులు నాలుగుగంటలపాటు గెలాక్సీ అపార్టుమెంటులో నలువైపులా తనిఖీలు చేశారు. కాగా, ఆ ఈమెయిల్ నకిలీదని గుర్తించిన పోలీసులు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన బాలుడు మెయిల్ పంపించినట్టుగా గుర్తించారు.

 

బాలుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. టిస్ హజారీ కోర్టులో అతను దాక్కున్నాడు. బాలుడి సోదరుడైన న్యాయవాది ద్వారా అతన్ని ఇంటికి రప్పించారు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  దీంతో న్యాయవాది అయిన బాలుడి సోదరుడిని కలిసిన బాంద్రా పోలీసులు అతని ద్వారా బాలుడిని ఒప్పించి ఇంటికి రప్పించారు. తర్వాత పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఇచ్చిన నోటీసును అతనికి చూపించి తమ వెంట తీసుకెళ్లి విచారించారు.

 

తర్వాత బాలుడిపై చార్జిషీట్‌ దాఖలు చేసి జువైనల్‌ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని విడిచిపెట్టామని పోలీసులు వెల్లడించారు.  ఇలాంటి బెదిరింపులు సల్మాన్ ఖాన్ కి కొత్త కాకపోయినా..ఈ సంఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: