నందమూరి నటసింహం బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో నటించిన రూలర్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. విభిన్న పాత్రలో కనిపిస్తున్న బాలయ్య తన పెర్ఫార్మెన్స్ తో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. గత బాలయ్ సినిమాల్లానే ఫుల్ మాస్ అంశాలతో ఉన్న టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య బాలయ్యకు తన సినిమా టైటిల్స్ అచ్చొస్తున్నాయనే చెప్పాలి. అన్నీ షార్ట్ టైటిల్స్ పెట్టుకుంటూ ప్రేక్షకుల్లోకి వెళ్లేలా క్యాచీ టైటిల్స్ సెలక్ట్ చేసుకుంటున్నాడు బాలయ్య.

 

 

నిజానికి ఈ రూలర్ అనే పదం జూ.ఎన్టీఆర్ సినిమా దమ్ము సినిమాలో ఓ పాటలో వస్తుంది. ఆ పదం పాపులర్ కావడంతో ప్రముఖ నిర్మాత కేఎస్. రామారావు ఈ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ తో రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఆయన ఆలోచన. అయితే బాలయ్య సినిమా లెజెండ్ సూపర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా రూలర్ టైటిల్ అనుకున్నారు. రూలర్ ను కేఎస్ రామారావు రిజిస్టర్ చేయించడంతో ఆయనను సంప్రదిస్తే తన ప్రాజెక్టు గురించి చెప్పడంతో బోయపాటి శీను తన సినిమాకు లెజెండ్ టైటిల్ పెట్టుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు యాదృచ్చికంగానే రూలర్ సెట్ అయింది. కేఎస్ రామారావు ప్రాజెక్టు లేట్ అవడం రూలర్ టైటిల్ కాలపరిమితి పూర్తి కావడంతో ఇప్పుడు బాలయ్యకు లైన్ క్లియర్ అయింది.

 

 

సింహ, లెజండ్, లయన్, డిక్టేటర్.. ఇప్పుడు రూలర్. సినిమా టైటిల్స్ పరంగా చిన్న కన్ఫ్యూషన్ ఉన్నా టైటిల్స్ క్యాచీగా ఉంటూ సినిమా కథలకు తగ్గట్టుగానే టైటిల్స్ పెట్టుకుంటున్నాడు. ఇందులో కొన్ని ఫ్లాప్ కాగా.. సింహ, లెజండ్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ తాను కోరుకున్న టైటిల్ ‘రూలర్’ వచ్చింది కాబట్టి ఈసారి బాలయ్య హిట్ కొడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: