ఓటీటీ వేదిక సినిమాని తినేస్తుంది! అని కామెంట్ చేసి ఇండస్ట్రీలో అందరిని ఒణికించారు అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు. ఆయన కామెంట్ తో ముందు ముందు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండబోతోందో ఇతర నిర్మాతలకు అర్థమైంది. ఇప్పటికే ఓటీటీ- డిజిటల్ వేదికల్లో అమెజాన్- నెట్ ఫ్లిక్స్ సినిమా బిజినెస్ ని తినేయడం ఖాయమన్న టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఇదే విషయంపై వెంకీమామ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డి.సురేష్ బాబు డిజిటల్ వల్ల సినిమా ప్రమాదంలో పడుతుందని అంగీకరిస్తూనే.. అసలు డిజిటల్ వల్ల నిర్మాతలు పూర్తిగా నష్టపోవడం ఉండదని కూడా మరో మాట అన్నారు.

బాగా తీస్తే జనం థియేటర్ కి వచ్చి చూస్తారు... తీయకపోతే ఓటీటీలో కూడా చూడరు! అంటూ మెల్లిగా అసలు సంగతి చెప్పారు. అంతేకాదు.. సినిమాలు తీసేవాళ్లు మంచి కంటెంట్ తో తీయాలి. అలా తీయకపోతే డిజిటల్లోనూ డిమాండ్ ఉండదు! అంటూ ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పారు. ప్రస్తుతం దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అంతేకాదు అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ సంస్థలు బోలెడంత నష్టాల్లో ఉన్నాయి. డబ్బు వెదజల్లి లాభనష్టాలతో పని లేకుండా గేమ్ ఆడుతున్నాయి. వాళ్లకు అదో సరదా! అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. మునుముందు ఈ ఓటీటీ గేమ్ లోకి యాపిల్ తో పాటు పలు కార్పొరెట్ దిగ్గజాలు బరిలో దిగుతున్నాయని గుర్తు చేసి మన నిర్మాతల్ని.. ఎగ్జిబిటర్లను కూడా హెచ్చరించారు.

 

ఇంతకీ డిజిటల్ కి బాబు వ్యతిరేకినా కాదా? ఒక ఎగ్జిబిటర్ కం నిర్మాతగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏది? అంటే అవ్వా కావాలి.. బువ్వా కావాలి! అంటూ ఫక్తు బిజినెస్ మేన్ లా ఆయన ఇచ్చిన క్లారిటికి మైండ్ బ్లాక్ అయింది.  థియేటర్లకు రప్పించేలా సినిమాలు తీయాలి. అమెజాన్ కి అమ్ముకునేలా కంటెంట్ ఉండాలి! అంటూ బాబు గారు మాట్లాడిన లాజిక్ ఇతర నిర్మాతలకు ఎక్కిందో లేదో కానీ.. మొత్తానికి మంచి సినిమా తీయకపోతే ఎక్కడా అది మార్కెట్ అవ్వదని క్లియర్ గా చెప్పారు.

 

వెంకీమామ సినిమా పదే పదే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన తేదీకి దాదాపు 50 రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ తర్వాత టైటిల్ కార్డ్స్ లో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అంటూ తెరపై కనిపించడం అందరికీ షాకిచ్చింది. దీంతో అసలు సురేష్ బాబు ఉద్ధేశం ఏమిటో! అంటూ అంతా షాక్ తిన్నారు. ఓటీటీ వేదికలు ఇండస్ట్రీని తినేస్తాయి అన్నంత మాత్రాన అవి ఉండకూడదు అనేది ఆయన ఉద్ధేశం కాదు. మంచి సినిమాలు తీసి అమ్ముకోవాలి! ఆ మాత్రం తెలివితేటలైనా ఉండాలి! అని హెచ్చరించినట్లు అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: