తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య పోలీసులు, అరెస్టులు అనే పదాలు చాలానే వినిపిస్తున్నాయి. మొన్నీమధ్య డ్రగ్స్ కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే మళ్లీ జరిగింది. తాజాగా టాలీవుడ్ హీరో మరియు నిర్మాత షేక్ బషీద్ జనాలను మోసం చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఆయనను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఉద్యోగాల పేరుతో ఈయన కోట్ల కుంభకోణం చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 30 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసాడని బషీద్‌పై ఫిర్యాదు చేసింది దుబాయ్ ఎంబసీ. ఆ దేశంలో ఎస్‌బికే గ్రూప్ పేరుతో బ్యాంకులను మోసం చేస్తూ.. నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ నకిలీ వ్యాపారం చేస్తున్నాడు బషీద్. 


ఈయనపై దుబాయ్ ఎంబసి చేసిన కంప్లైంట్ తీసుకుని పోలీసులు విచారణ మొదలుపెట్టగా సంచలన నిజాలు బయటికి వచ్చాయి. దుబాయ్ పేరుతో చాలా మంది నిరుద్యోగులను మోసం చేసాడు బషీద్. గతంలోనే ఈయనపై కొన్ని కేసులు ఉన్నాయి. అప్పట్లో ఈయన అల్లరి నరేష్, వేణు హీరోలుగా నటించిన అల్లరే అల్లరి సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత మెంటల్‌ అనే మరో సినిమాను కూడా నిర్మించాడు. దాంతో పాటు ఎవడ్రా హీరో పేరుతో ఈయనే ఓ సినిమా చేసాడు కూడా. అందులో ఈయనే హీరో కమ్ ప్రొడ్యూసర్.


అప్పట్లో బ్యాంకు ఆఫ్‌ బరోడాను మోసం చేసిన కేసులో పోలీసులు ఈయన్ని అరెస్ట్‌ చేశారు. బషీద్‌ తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకున్నాడని.. వివాదంలో ఉన్న ఒక స్థలం పత్రాలను సృష్టించి ఈ రుణం తీసుకున్నాడని అప్పట్లో కేసులున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో బషీద్‌ నిందితుడు. సిండికేట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండిస్‌, పంజాబ్‌ బ్యాంకులను దాదాపు 100 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి పనే చేసి అడ్డంగా దొరికిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: