జీవిత ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ మలుపు ప్రమాదం కావచ్చు, ప్రమోదం కావచ్చు. ఒక జర్నీ ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో తెలియజేసిన సినిమా జర్నీ. ఈ సినిమా విడుదలై నేటితో 8ఏళ్లు పూర్తయ్యాయి.  నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం ఈ ప్రమాదాలకు కారణమౌతోంది. ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ అంశానికి  అద్భుతమైన ప్రేమ కథను జోడించి తమిళంలో రూపొందించిన చిత్రం "ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌"ను తెలుగులో ‘జర్నీ’గా నిర్మాత సురేష్ కొండేటి  తెలుగు ప్రేక్షకులకు అందించారు. శర్వానంద్‌, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ  సినిమా తెలుగులోనూ ఘనవిజయాన్ని సాధించింది. కొత్త దనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత... ఈ సినిమాను ఉన్నత శిఖరాలపై నిలబెట్టింది. 

 

కథలోకి వెళితే...శర్వానంద్‌ తన స్నేహితుడిని డ్రాప్‌ చేయడానికి హైదరాబాద్‌ బస్టాండ్‌కు వస్తాడు. అక్కడికే వచ్చి తను వెళ్ళాల్సిన సాఫ్ట్‌వేర్  కంపెనీ అడ్రసు తెలియక తన అక్కతో ఫోన్‌లు మాట్లాడుతుంది అనన్య. ఆమె పల్లెటూరు నుంచి హైదరాబాద్‌ వస్తుంది. తన అక్క వేరే పనివల్ల ఆమెను రిసీవ్‌ చేసుకోలేక పోతుంది. సిటీలో చాలా జాగ్రత్తతో ఉండాలని సూచనలు కూడా చేస్తుంది. ఫోన్‌లో అడ్రస్‌ తెలీయక ఆ పక్కనే ఉన్న శర్వానంద్‌ సాయం అడుగుతుంది. ఆ సాయం తనను ఇంటర్వ్యూకు దగ్గరుండి తీసుకుళ్ళేలా చేసుకుంటుంది అనన్య. తన అమాయకత్వం చూసి శర్వానంద్‌ ముగ్దుడవుతాడు. ఇది ప్రేమకు ఒక కోణం. 

 

మరోవైపు....జై టెక్నికల్‌ కోర్సు చేసి అప్రంటిస్‌గా పనిచేస్తుంటాడు.కొద్దిగా దూరమైనా ఎదురింటి అంజలిని జై ప్రేమిస్తాడు. తనను ప్రేమించాలంటే కొన్నింటికి తట్టుకోవాలని అంజలి జైకు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన అతన్ని అనన్య ప్రేమిస్తుంది. జై తన తల్లి దగ్గరకు అనన్యను తీసుకెళ్లడానికి బస్‌ ఎక్కుతాడు. అటువైపు నుంచి అనన్యను వెతుక్కుంటూ శర్వానంద్‌ బస్‌ ఎక్కుతాడు. ఇంటర్వ్యూ ముగించుకుని అనన్య బస్‌ ఎక్కుతుంది.రెండు బస్సులు వ్యతిరేకదిశలో ప్రయాణం సాగుతాయి. అలా ఒక్కచోట వచ్చేసరికి మితిమీరిన వేగంతో ఈ రెండు బస్సులు గుద్దుకోవడంతో ప్రయాణికులు చాలామంది చనిపోతారు. కొందరికి తీవ్ర గాయాలవుతాయి. తన కళ్ళముందే జై చనిపోవడం, తను చూస్తుండగానే అనన్యకి విపరీతగాయాలు కావడం అంజలి, శర్వానంద్‌లు షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత ఎవరికి వారు తమవారిని తీసుకొని వెళ్ళిపోతారు. కథ విషాదంతమైనా ప్రేక్షకులు దీన్ని ఇంతగా ఆదరించడానికి కారణం మన హృదయాంతరాళాలను తట్టిలేపడమే. ఇందులో పాత్రధారుల కంటే పాత్రలే కన్పిస్తాయి. ఎవరూ నటించినట్లు ఉండదు. దర్శకుడు స్క్రీన్‌ప్లే చూపించడంలో తగిన శ్రద్ధతీసుకున్నాడు. 

 

మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కోపతాపాలు, అనుమానాలు, ప్రవర్తనలు ఇరు జంటల మధ్య బాగా చూపించాడు దర్శకుడు శరవణన్. పతాక సన్నివేశాలు హృదయాన్ని పిండేస్తాయి. ప్రేమకథలు చెబుతూ... అందులోనూ జీవితాన్ని చూపించిన ప్రయత్నమే ఈ జర్నీ. నిర్మాత ఏమన్నారు?
ఈ సినిమాలో మెయిన్ పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాను. ‘ఒక విధంగా ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. నా జర్నీ ఈ రోజు ఇలా ఉందంటే ఈ జర్నీ సినిమానే కారణం. ప్రతి మనిషి జీవితంలోనూ జర్నీ ఉండాల్సిందే. అన్ని జర్నీలూ విషదం కావు. విషాదం ఎదురవుతుందని మన ప్రయాణం ఆపుకోలేం. మన చేతుల్లో ఏదీ లేకపోయినా మన ప్రయాణం నిరంతరం సాగాల్సిందే’అన్నారు. ఈ సినిమా 8 ఏళ్ల ప్రయాణం సందర్భంగా ఈ ప్రయాణంలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: