గత దశాబ్ద కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) లో ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. మా అధ్యక్షుడిగా శివాజీరాజా ఉన్న సమయంలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశారని శివాజీరాజాపై విమర్శలు వచ్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత గత ఎన్నికల సమయంలో శివాజీరాజా నరేష్ వర్గాలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. 
 
మెగా బ్రదర్ నాగబాబు శివాజీరాజా, నరేష్ లలో నరేష్ కు మద్దతు ఇవ్వటంతో నరేష్ "మా" అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. నాగబాబు ఎన్నికల్లో సహకరించకపోవడంతో శివాజీ రాజా మెగా బ్రదర్ నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ చేశారు. ఆ తరువాత జనసేన పార్టీ తరపున నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేసిన సమయంలో శివాజీరాజా నరసాపురంలో నాగబాబును ఓడించాలంటూ ప్రచారం చేశాడు. 
 
నరేష్ అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత కూడా మా లో వివాదాలు ఏ మాత్రం తగ్గకపోగా పెరిగాయి. నరేష్ అన్ని విషయాల్లో ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ జీవిత, రాజశేఖర్ ఆరోపణలు చేయటంతో విభేదాలు తెలెత్తాయి. నరేష్ పని తీరుపై ఈసీ మెంబర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, నరేష్ లేకుండానే "మా" సమావేశాలు జరిగాయి. మరో వైపు గత దశాబ్ద కాలంలో చిన్న నటులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 
 
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు నటులకు అవకాశాలు కల్పించటం లేదంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వం కల్పించలేదంటూ ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి అలా ఆరోపణలు చేయటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీరెడ్డికి "మా" లో సభ్యత్వం ఇవ్వమని శ్రీరెడ్డితో కలిసి నటిస్తే వారి సభ్యత్వం కూడా రద్దు చేస్తామని వివాదాన్ని మరింత రాజేసి "మా" పరువు తీసుకుంది. ఆ తరువాత "మా" మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి యూ టర్న్ తీసుకుంది. శ్రీరెడ్డిపై ఎలాంటి బ్యాన్ విధించడం లేదని "మా" శ్రీరెడ్డిని సగర్వంగా ఆహ్వానిస్తోందంటూ యూ టర్న్ తీసుకోవటంతో "మా" అసోసియేషన్ పరువు పోయింది. శ్రీరెడ్డి వివాదం ద్వారా చిన్న నటులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందటానికి ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: