ప్రభాస్ ను ప్రభాస్ అని పిలిచే అభిమానుల కంటే డార్లింగ్ ప్రభాస్ అని పిలిచే అభిమానులే ఎక్కువ. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రభాస్ ఆ బ్యాక్ గ్రౌండ్ ను వాడుకోకుండా గ్రౌండ్ లెవెల్ నుండి ప్రయాణం మొదలుపెట్టి అలుపెరగకుండా శ్రమించి అవకాశాల కోసం అన్వేషించాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ తెలుగు హీరోల్లో ఏ హీరోకు లేని అరుదైన రికార్డులను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.
 
ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఈశ్వర్ సినిమాతో పరవాలేదనిపించుకున్న ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో నటించాడు. రాఘవేంద్ర సినిమా డిజాస్టర్ అయింది. వర్షం సినిమాతో ప్రభాస్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వర్షం తరువాత ప్రభాస్ నటించిన అడవిరాముడు, చక్రం ఫ్లాప్ కాగా రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఛత్రపతి తరువాత ప్రభాస్ నటించిన చాలా సినిమాలు హిట్ కాలేదు. 
 
డార్లింగ్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తరువాత నటించిన మిస్టర్ పర్ ఫెక్ట్ కూడా హిట్ అయింది. రెబెల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ మిర్చి సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 1500 కోట్ల రూపాయల మైలురాయిని సునాయాసంగా అందుకున్నాడు. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో సాహో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడం గమనార్హం. 
 
ప్రభాస్ సినీ కెరీర్లో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఐదు సంవత్సరాల పాటు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా ప్రభాస్ కష్టపడి బాహుబలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 17 సంవత్సరాలకు పైగా కష్టం, అంకిత భావం, సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో విభిన్నమైన చిత్రాలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో ప్రభాస్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రభాస్ తపన, రాజమౌళి కృషికి ప్రతీక బాహుబలి సిరీస్. ప్రభాస్ ప్రతిమను 2017 సంవత్సరంలో బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్టించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: