టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 200కు పైగా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలో తెలుగు చిత్రసీమలో ఎన్నో సంచలన విజయాలు.. మరెన్నో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ప్రతీ హీరో అద్భుతమైన విజయంతో పాటుగా భారీ ప్లాప్‌లను సైతం చవి చూసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్ర‌తీ యేడాది నూటికి 90 శాతం సినిమాలు బోల్తా కొడుతుంటాయి. ఆ మేర‌కు నిర్మాత‌లు న‌ష్ట‌పోతుంట‌తారు. సినిమా తీసిన వాళ్లు, కొన్న‌వాళ్లూ.. తీవ్రంగా న‌ష్ట‌పోతారు. స‌గం డ‌బ్బులు కూడా వెన‌క్కి రాని ప‌రిస్థితి. అయితే 2019లోనూ డిజాస్ట‌ర్లు వ‌రుస క‌ట్టాయి. భారీ న‌ష్టాల్ని తెచ్చిపెట్టాయి. వాటిపై ఓ లుక్కేయండి.

 

జ‌న‌వ‌రి:
జ‌న‌వ‌రి సంక్రాంతి సీజ‌న్‌లో ‘ఎఫ్ 2’ ఒక్క‌టే భారీ విజ‌యాన్ని అందుకుంది. ఎన్టీఆర్ జీవిత క‌థ‌గా తెర‌కెక్కిన ‘క‌థానాయ‌కుడు’ నంద‌మూరి అభిమానుల‌నే కాదు, తెలుగు చిత్ర‌సీమ‌నీ బాగా నిరాశ ప‌రిచింది. మ‌రియు ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. రిలీజైన తర్వాత అవి కాస్తా నీరు కారిపోయాయి. 

 

ఫిబ్ర‌వ‌రి:
ఎన్టీఆర్ బ‌యోపిక్ పార్ట్ 2 ‘మ‌హానాయ‌కుడు’ భారీ డిజాస్ట‌ర్ అయింది.  క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాబ‌ట్టుకోలేక‌పోయింది. మ‌రో విష‌యం ఏంటంటే.. బాల‌య్య కెరీర్‌లోనే అత్యంత స్వ‌ల్ప‌మైన వ‌సూళ్ల‌ని అందుకున్న సినిమా ఇదే.

 

మే: 
మార్చి, ఏప్రిల్‌లో తెలుగు సీమ సైలెంగ్ ఉంది. ఇక మేలో విడుద‌లైన ‘సీత‌’ సినిమా కూడా డిజాస్ట‌ర్‌గా మారింది.  బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా రెండో సారి నటించిన ఈ సినిమా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఇక ఇదే నెల‌లో విడుద‌లైన అల్లు శిరీష్ సినిమా ‘ఏబీసీడీ’ కూడా డిజాస్ట‌ర్‌గా తేల్చేయొచ్చు. 

 

జూన్‌: 
ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత  ఎన్నో వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన  మంచు విష్ణు ‘ఓట‌ర్‌’ సినిమాకి  మోక్షం దొరికింది. అయితే జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా డిజాస్ట‌ర్ జాబితాలో చేరిపోయింది.

 

జులై: 
ఈ నెల‌లోనూ చిత్ర‌సీమ‌కు చాలా ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. ఎన్ని సినిమాలు వ‌స్తూ.. పోతున్నా ఒక్క‌టి కూడా నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. ఇక జులైలో కూడా ఒక‌ట్రెండు హిట్లు కొట్టినా.. ఫ్లాపుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నెల‌లో విడుద‌ల అయిన `దొర‌సాని`,  విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్‌` రెండు చిత్రాలు బాక్సాఫిస్ వ‌ద్ద చ‌తికిల ప‌డ్డాయి.

 

ఆగ‌స్టు: 
ఇక ఆగ‌స్టులోకే ఫ్లాపుల బాట‌లోనే సాగింది. అక్కినేని నాగార్జున ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `మ‌న్మ‌థుడు 2`, శ‌ర్వానంద్ `ర‌ణ రంగం`, కార్తికేయ `గుణ 369` మూడు చిత్రాలు కూడా ఊహించ‌ని దెబ్బ కొట్టాయి. అలాగే మ‌న్మ‌థుడు 2 సినిమా వ‌ల్ల నాగార్జున‌కు అనుకోని విధంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు.

 

సెప్టెంబ‌రు: 
సెప్టెంబ‌రు నెల‌లో యంగ్ హీరో ఆది సాయికుమార్ యూత్ ఫుల్, లవ్‌స్టోరీ  ‘జోడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. స‌రైన ప్ర‌మోష‌న్లూ, ప్లానింగూ లేకుండా వ‌చ్చిన సినిమా ఇది. ఫ‌లితం కూడా దానికి త‌గ్గ‌ట్టే వ‌చ్చింది. మ‌రోవైపు న్యాచుర‌ల్ స్టార్ నాని గ్యాంగ్ లీడ‌ర్ సినిమా కూడా ఓపెనింగ్స్‌తో స‌రిపెట్టుకుంది.

 

అక్టోబ‌రు: 
యంగ్ హీరో సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్’ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల అయింది. కానీ.. నిర్మాత‌లు రూపాయికి ముప్పావ‌లా పోగొట్టుకున్నారు. మ‌రోవైపు గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కిన ‘చాణ‌క్య‌’ సినిమాకు కూడా గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా క‌రువ‌య్యాయి.

 

న‌వంబ‌రు: 
న‌వంబ‌రు నెల‌లో వారానికి రెండు మూడు సినిమాలు వ‌చ్చిన‌ ఒక్క హిట్ కూడా అందుకోలేక‌పోయాయి. రాగ‌ల 24 గంట‌ల్లో, జార్జ్ రెడ్డి.. రెండు సినిమాలు డిజాస్ట‌ర్ లిస్ట్‌లో చేరాయి.

 

డిసెంబ‌రు:
సంవ‌త్స‌రం చివ‌రి నెల కాబ‌ట్టి సినిమాల హ‌వా న‌డుస్తోంది. శ్రీ‌నివాస‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ, నిర్మించిన సినిమా ‘భాగ్య న‌గ‌ర వీధుల్లో’. 2 కోట్ల‌తో తీసిన సినిమా ఇది. చివ‌రికి పోస్ట‌రు ఖ‌ర్చులూ రాలేదు. తాజాగా వ‌చ్చిన వెంకీ మామ మాత్రం టాక్ ప‌రంగా ఎలా ఉన్న క‌లెక్ష‌న్స్ ప‌రంగా మాత్రం దూసుకుపోయింది. ఈ నెల‌లోనే రూల‌ర్‌, ప్ర‌తీరోజూ పండ‌గే, ఇద్ద‌రిలోకం ఒక్క‌టే చిత్రాలు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: