ప్ర‌స్తుతం అగ్ర హీరోలంతా యూత్‌తో పాటుగా స‌మానంగా మేమేమి త‌క్కువ కాద‌న్న‌ట్లు సినిమాల్లో బిజీ బిజీగా న‌టించేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముందుండేది వీళ్ళే...రికార్డులు తిర‌గ‌రాయాల‌న్నా వీళ్ళే... టాలీవుడ్ క‌లెక్ష‌న్ల బాక్సులు బ‌ద్ద‌ల‌కొట్టాల‌న్నా వీళ్ళే. ఇక సినిమా హిట్, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా అభిమానుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేది వీళ్లే. ఏ కొత్త ద‌ర్శ‌కుడు క‌థ రాయాలంటే.. వాళ్ల‌ని దృష్టిలో ఉంచుకునే రాయాలి. ఓ నిర్మాత సూట్ కేస్ ప‌ట్టుకుని రంగంలోకి దిగుతున్నాడంటే మ‌దిలో మెదిలో హీరోలూ వీళ్లే. ఇంత‌లా ప్ర‌భావితం చేసిన టాప్ హీరోలు వాళ్ళ‌ పోగ్రెస్ కార్డులో 2019 ఎలా గ‌డిచింది? ఓ లుక్ వేద్దాం...

 

మ‌హేష్‌బాబు: ఈ యేడాది ‘మ‌హ‌ర్షి’తో ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు మ‌హేష్‌. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మ‌హేష్ న‌టించిన 25వ సినిమా ఇది. సెంటిమెంట్‌గా కూడా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ యేడాది ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ షూటింగుతో బిజీ బిజీగా ఉన్నాడు. కొత్త క‌థ‌ల‌కూ ఓకే చేశాడు. క‌మ‌ర్షియల్ యాడ్లూ, బ్రాండింగులూ మామూలే. ఈ యేడాది మ‌హేష్‌కి మెమ‌ర‌బుల్ అనే చెప్పాలి.

 

ఎన్టీఆర్‌: ఈ యేడాది ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మొద‌లెట్టిన‌ప్పుడే 2019 లో ఎన్టీఆర్ క‌నిపించ‌డ‌న్న సంగ‌తి అర్థ‌మైంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆర్.ఆర్.ఆర్ మూవీ చూడాలంటే 2020 చివ‌ర్లోనే. అనుకున్న తేదీక‌ల్లా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రెడీ అయితే ప‌ర్వాలేదు. లేదంటే.. 2021 సంక్రాంతినే ఎన్టీఆర్ ని చూసే అవ‌కాశం ఉంటుంది. ఈలోగా అట్లీ చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పాడు ఎన్టీఆర్‌. షారుఖ్ ఖాన్అట్లీ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. అది పూర్త‌వ్వ‌గానే ఎన్టీఆర్ తో సినిమా మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

 

రామ్ చ‌ర‌ణ్‌: ఈ ఏడాది చరణ్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. అదే.. వినయ విధేయ రమా. కానీ ఈ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. అందులో నుంచి తేరుకుని ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో బిజీ అయ్యాడు. ‘సైరా’ నిర్మాణ బాధ్య‌త‌ల్ని నెర‌వేర్చాడు. ఇప్పుడు చిరు – కొర‌టాల శివ సినిమాకీ తాను భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

 

ప్ర‌భాస్‌: ప్ర‌భాస్‌కి ఈయేడాది మిక్స్‌డ్  ఫీలింగ్ క‌లిగి ఉంటాయి. ఎందుకంటే ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ‘సాహో’ అనుకున్న విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ప్ర‌భాస్ స్టామినాని మ‌రింత బ‌లోపేతం చేసింది. ‘జాన్‌’ ఈ యేడాదే వ‌స్తుంద‌ని అభిమానులు ఆశించారు. కానీ.. చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవ్వ‌డంతో 2020కి వాయిదా ప‌డింది.

 

అల్లు అర్జున్‌: 2019లో అల్లు అర్జున్ కూడా ఖాళీనే. ‘నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ త‌ర‌వాత బ‌న్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. త్రివిక్ర‌మ్‌తో సినిమా కూడా ఆల‌స్యంగా ప‌ట్టాలెక్క‌డంతో ఈ యేడాది బ‌న్నీని చూడ‌లేక‌పోయాం. 2020కి ఆరంభంలోనే బ‌న్నీ వ‌చ్చేస్తున్నాడు. ‘అల‌.. వైకుంఠ‌పుర‌ముతో’. సుకుమార్ సినిమా కూడా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. 

 

ర‌వితేజ‌: 2018లో ర‌వితేజ‌కు గ‌ట్టి దెబ్బ‌లు త‌గిలాయి. ట‌చ్ చేసి చూడు, నేల టికెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ర‌వితేజ జాగ్ర‌త్త ప‌డిపోయాడు. త‌న మ‌రుస‌టి సినిమా కోసం ఆచి తూచి క‌థ‌ని ఎంచుకున్నాడు. ఎట్ట‌కేల‌కు ‘డిస్కోరాజా’కి ఓకే చెప్పాడు. విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈ యేడాది విడుద‌ల కావాల్సింది. కానీ.. జ‌న‌వ‌రి 24న వాయిదా ప‌డింది. సో.. ర‌వితేజ కూడా ఈ యేడాది క‌నిపించ‌లేదు. 

 

చిరంజీవి: అగ్ర హీరోలంతా ఈ యేడాది బిజి బిజీగా గ‌డిపారు. చిరంజీవి ‘సైరా’తో త‌న క‌ల‌ల ప్రాజెక్టుని సాకారం చేసుకున్నాడు. చిరు క‌ష్టం తెర‌పై క‌నిపించింది. మంచి సినిమా తీశారన్న ప్ర‌శంస‌లు అందాయి. కాక‌పోతే… బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాత్రం స‌రైన ఫ‌లితం రాలేదు. ఇప్పుడు కొర‌టాల శివ సినిమా కోసం బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నారుచిరు. ఈనెల‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. 

 

బాల‌కృష్ణ‌: బాల‌య్య నుంచి ఈ యేడాది ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా ‘రూల‌ర్’ ఈనెల‌లోనే విడుద‌ల కానుంది. అయితే… వ‌చ్చిన రెండు సినిమాలూ (క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు) ఫ‌ట్ మ‌న్నాయి. ‘రూల‌ర్’ పై కూడా అంచ‌నాలు అంతంత మాత్ర‌మే. రిజ‌ల్ట్స్ ఎలా ఉన్నా బాల‌య్య మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. 

 

 నాగార్జున‌: నాగ్‌కి ఈ యేడాది క‌లిసి రాలేదు. అదే.. ‘మ‌న్మ‌థుడు 2’. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. మన్మ‌థుడు అనే టైటిల్‌ని అన‌వ‌స‌రంగా పాడు చేశార‌ని అభిమానులే తిట్టుకున్నారు. ఆర్థికంగానూ ఈ సినిమా న‌ష్ట‌ప‌రిచింది.  అలాగే ఆ చిత్రంతో నాగార్జున ప‌రువు కూడా పోయింది. బాలీవుడ్ లో ఓ సినిమా చేశారు గానీ, అది ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ అవ్వ‌లేదు. నాగ్ బాగా రిలాక్సయిపోయార‌ని, అందుకే సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌ని అభిమానులే అంటున్నారు. 

 

వెంక‌టేష్‌: వెంకీ కి 2019 ప్ల‌స్ అయ్యింది. సంక్రాంతికి వ‌చ్చిన‌ ‘ఎఫ్ 2’ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్ల‌కు మించి వ‌సూళ్లు అందుకుంది. ఈనెల‌లో విడుద‌లైన ‘వెంకీ మామ‌’కు డివైట్ టాక్ వ‌చ్చినా బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు బాగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: