ఈ మధ్య కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటడుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో బాధ పడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం ప్రముఖ కమెడియన్ అలీ తల్లి జైతూన్ బీబీ అనారోగ్యంతో రాజమహేంద్రవరంలో మృతి చెందారు. ఈ ఘటనలు మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. 
 
ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత సీహెచ్ మురళి ఈరోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మురళి ఆయన స్వగృహంలో కన్నుమూశారు. మురళి ఎడిటర్ గా, నిర్మాతగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 350 సినిమాలకు ఎడిటర్ గా, 20 సినిమాలకు నిర్మాతగా మురళి వ్యవహరించారు. 
 
మురళి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సినీప్రముఖులు మురళి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. రేపు మురళి అంత్యక్రియలు జరగనున్నాయి. మురళి ఇక లేరన్న వార్త తెలిసిన సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎడిటర్ గా , నిర్మాతగా సినిమా రంగానికి మురళి విశేష సేవలందించారు. మురళి ఎడిటర్ గా పని చేసిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఘనవిజయం సాధించాయి. 
 
నిర్మాతగా కూడా చెప్పుకోదగ్గ విజయాలనే మురళి అందుకున్నారు. మురళి వ్యక్తిగతంగా చాలా మంచివారని ఇతరులు కష్టాల్లో ఉంటే తన వంతు సహాయం చేసేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మురళి మృదు స్వభావి అని కష్టపడేతత్వంతో సినిమా రంగంలో ఎదిగాడని సన్నిహితులు చెబుతున్నారు. మురళి బంధువులు ఇప్పటికే ఆయన స్వగృహానికి చేరుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు మురళి ఇంటి దగ్గరకు చేరుకొని నివాళులర్పించారు. సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న వారు మృత్యువాత పడుతూ ఉండటంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: