నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌. పక్కా మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా దారుణంగా నిరాశపరిచింది. దీంతో మరోసారి బాలయ్య సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవని టాక్ మొదలైంది. బాలయ్య హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లు దారుణంగా ఫెయిల్‌ అవ్వటంతో నందమూరి అభిమానులు ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మించాడు. భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్‌, నాగినీడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మీద జనాలు పెట్టుకున్న ఆశలన్ని ఒక్క షో తో ఆవిరైపోయాయి. 

 

ఇక పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్‌ కు మొదటి షో నుంచే డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. ముఖ్యంగా లాజిక్‌ లేని సీన్స్‌, బాలయ్య లుక్‌పై విపరీతంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. కథా, కథనాలు రొటీన్‌గా ఉండటం, టేకింగ్ అంతకు మించి పరమ రొటీన్‌ అనిపించటంతో రూలర్‌ ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశలో ఉండిపోయారు. అయితే టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టాడు బాలయ్య. మొదటి రోజు ఈ సినిమా దాదాపు 5 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. నెగెటివ్‌ టాక్‌ ఉన్నా.. లాంగ్ గ్యాప్ తరువాత బాలయ్య మాస్ సినిమా చేయటంతో థియేటర్లు కళకళలాడాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా సినిమాకు కలిసొచ్చాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్లు పరవాలేదనిపించాయి. అయితే సెకండ్ డే మాత్రం బొమ్మ తిరగబడింది.

 

రెండో రోజుకు రూలర్‌ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజు 5 కోట్లు వసూళ్లు చేసిన రూలర్‌, రెండో రోజు మూడు కోట్ల మార్క్‌ను కూడా చేరలేకపోయాడని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. వీకెండ్‌ అయినా టాక్‌ ఏ మాత్రం బాగా లేకపోవటంతో ఆ ప్రభావం కలెక్షన్ల మీద దారుణంగా పడింది. రెండో రోజుకే థియేటర్లు అసలు జనాలు లేక వెలవెలబోయాయి. వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే బాలయ్య సినిమాకు మరోసారి భారీ నష్టాలు తప్పవంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ బాలయ్య-బోయపాటి సినిమా మీద గట్టిగా పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: