ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చెన్నై వేదికగా నిర్వహించారు. దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన తారలు ఈ వేడుకలో సందడి చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డుల ప్రధానం చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి రంగస్థలం, మహానటి సినిమాలు సత్తా చాటాయి. రంగస్థలం 5 అవార్డులు సాధించగా మహానటి 4 అవార్డులు సాధించింది.

 

ఉత్తమ చిత్రంగా కీర్తి సురేశ్ ప్రధాన్ పాత్రలో నటించిన 'మహానటి' ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా అదే సినిమాకు పనిచేసిన నాగ్‌ అశ్విన్, ఉత్తమ నటుడిగా రామ్‌ చరణ్‌ (రంగస్థలం), ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ (మహానటి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్ విభాగం)గా దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి), ఉత్తమ నటి (క్రిటిక్స్ విభాగం)గా రష్మిక మందన్న (గీతా గోవిందం), ఉత్తమ సహాయ నటిగా అససూయ భరద్వాజ్‌ (రంగస్థలం), ఉత్తమ సహాయ నటుడిగా జగపతిబాబు (అరవింద సమేత వీరరాఘవ),ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవే), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు రంగస్థలం సినిమాకు అవార్డులు అందుకున్నారు.

 

గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాటను ఆలపించిన సిద్‌ శ్రీరామ్‌ ఉత్తమ గాయకుడిగా అవార్డును సాధించాడు. భాగమతి సినిమాలోని మందార మందార పాటను ఆలపించిన శ్రేయా ఘోషల్‌ ఉత్తమ గాయనిగా ఫిలిం ఫేర్ సాధించింది. ఇక పోతే తమిళ సినిమాలలో ఉత్తమ కథానాయకుడి అవార్డును ధనుష్ (వడ చెన్నై) మరియు విజయ్ సేతుపతి (96) కలిసి పంచుకోవడం విశేషం.

 

ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు. ఇది సౌత్ ఫిల్మ్ ఫేర్ యొక్క 66వ అవార్డుల కార్యక్రమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: