యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రూలర్ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. హ్యాపీ మూవీస్, సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల సి కళ్యాణ్ ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మించారు. మాస్, యాక్షన్ కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ లభించింది. రెండవ రోజు నుండి కేవలం పర్వాలేదనిపించేలా ఈ సినిమా ప్రస్తుతం ముందుకు సాగుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో భాగంగా ఈ సినిమా విశేషాలను గురించి బాలయ్య పంచుకున్నారు. 

 

జైసింహా సినిమా చేస్తున్నప్పుడే తనకు రవికుమార్ గారి దర్శకత్వ విధానం నచ్చిందని, అవకాశం ఉంటె ఆయనతో మరొక సినిమా చేయాలని భావించినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో అనుకోకుండా పరుచూరి మురళి ఒక మంచి కథ తీసుకురావడం, ఆ కథను రవికుమార్ గారు కూడా మెచ్చుకోవడంతో ఫైనల్ గా ఈ రూలర్ సినిమా ప్రారంభం అయిందని అన్నారు. ఇక మాటల సందర్భంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన బాలయ్య, తన చేతికి పలు రకాల ఉంగరాలు పెట్టుకుని ఉండడంతో, తనకు మూఢ నమ్మకాలు ఎక్కువని పలువురు భావిస్తుంటారని, అయితే అది పూర్తిగా తప్పని అన్నారు బాలయ్య. 

 

నిజానికి తనకు ఆధ్యాత్మికత భావాలు ఎక్కువేనని, ఇక తన చేతికి ఉన్న ఇన్ని రకాల ఉంగరాలు, పలువురు అభిమానులు ఎంతో ప్రేమతో పలు సందర్భాల్లో ఇచ్చినవని, అందుకే తాను వాటిని ఎప్పుడూ చేతికి పెట్టుకునే ఉంటానని బాలయ్య చెప్పుకొచ్చారు. గత కొద్దిరోజులుగా బాలకృష్ణ చేతికి ఎందుకు అన్ని ఉంగరాలు ఉంటాయి అంటూ పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నందున ఆ వార్త కొద్దిరోజలుగా వైరల్ గా మారింది. ఇక నేడు తన ఉంగరాల వెనుక వున్న అసలు విషయాన్ని బాలయ్య బయటపెట్టడంతో, ఇకపై ఆ పుకార్లకు పూర్తిగా తెరపడ్డట్లైంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: